Nagoba Jatara : ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్య మాసంలో జరిగే నాగోబా జాతర అధ్యంతం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. అమావాస్య రోజు ప్రారంభించిన ఈ జాతరకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసి భక్తులు హాజరవుతారు. ఈ జాతరలో వివిధ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఆదివాసి పద్ధతిలో నిర్వహిస్తారు. ఆదివాసి తెగలు గోండ్ (పర్థాన్) లో మేస్రం వంశస్థుల వంశదేవునిగా నాగోబా (సర్పం)ను ఆరాధిస్తారు. ఎంతో నియమనిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. బేటింగ్…మహా పూజ అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆదివాసి మేస్రం వంశంలోని కొత్త కోడళ్లు అప్పటివరకు నాగోబా ఆలయం ప్రవేశం చేయనటువంటి కోడళ్లు ఈ కార్యక్రమంతో ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ జాతరలో భాగంగా ఆదివారం నాడు పేర్సే పేన్ పూజ, బేటింగ్ నిర్వహించారు. ఆదివాసి గోండు వారి ఆదిదేవుడుగా పేర్సే పేన్ ను పూజిస్తారు. అదే విధంగా నాగోబా ఆలయం వెనకాల ఉన్నటువంటి బాన్ ఆలయంలో ముందుగా పటేల్స్ కిత్త గ్రూప్ వారు పూజ చేసి అనంతరం మిగతా వారు పూజ చేశారు. అనంతరం బేటింగ్ కార్యక్రమాలకు హాజరైన కొత్త కోడలు మట్టికుండలతో నీరు తీసుకువచ్చి పుట్ట తయారు చేసి పూజలు నిర్వహించారు.