central cabinet approves pm vidyalaxmi scheme | PM Vidya Laxmi: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

Union Cabinet Approves PM Vidya Laxmi Scheme: ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో వారి కలలను సాకారం చేసుకోలేకపోతోన్న మధ్య తరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం – విద్యాలక్ష్మి (PM Vidya Laxmi) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ఈ పథకం కింద ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు రుణాలు పొందొచ్చు. దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకూ రుణం లభించనుంది. ఈ రుణంలో 75 శాతం వరకూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. అలాగే, ఎఫ్‌సీఐలో మూలధన అవసరాలకు రూ.10,700 కోట్లు కేటాయించేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది.

22 లక్షల మందికి లబ్ధి

పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇది సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తింపచేయాలని అన్నారు. రూ.10 లక్షల వరకూ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ కల్పించనున్నారు. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి వైష్ణవ్ తెలిపారు.

మరోవైపు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు ఉన్న అవకాశాన్ని కేంద్రం మరో ఏడాది పెంచింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇప్పటివరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉంది. అయితే ఇకపై 3 సంవత్సరాలు పరీక్ష రాసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. 

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు వెనుక ఉష- తమిళ అమ్మాయిని ఓడించిన తెలుగమ్మాయి!

మరిన్ని చూడండి

Source link