FIR Filed Against Congress Leader Rahul Gandhi: దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన వేళ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అస్సాంలోని గువాహటి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు స్వతంత్ర పరిమితులను దాటాయని.. అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు, వేర్పాటు వాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అన్నారు. ‘ప్రతిపక్ష నాయకుడిగా.. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉంది. కానీ, ఆయన అందుకు బదులుగా అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.’ అని చాటియా ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
రాహుల్ ఏమన్నారంటే.?
కాగా, ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఎస్సెస్ వంటి మా భావజాలం వేల ఏళ్ల నాటిది. బీజేపీ, ఆర్ఎస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్సెస్‌తో పాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నాం.’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలు రూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు.
కులగణనపై రాహుల్ విమర్శలు – మండిపడ్డ ఎన్డీయే
కాగా, బీహార్‌లో సర్కారు చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీ ఫేక్‌గా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత శనివారం తొలిసారి బీహార్ పర్యటించిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలన మోసం చేసేందుకు ఉద్దేశించి.. 2022 – 23లో బీహార్‌లో స్థానిక ప్రభుత్వం నిర్వహించిన విధంగా ఈ ప్రక్రియ నకిలీది కాదని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే మండిపడింది. మొన్నటివరకూ బీహార్ కుల సర్వేను ప్రశంసించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు దాన్ని నకిలీదిగా పేర్కొనడం విస్మయం కలిగిస్తుందని పేర్కొంది. నితీశ్ కుమార్ గతంలో ‘ఇండియా’ కూటమి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు రాహుల్ మౌనంగా ఉన్నారని ఆరోపించింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కులగణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించింది.
మరోవైపు, రాహుల్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా విమర్శించారు. భారత ప్రభుత్వానికి, దేశానికి మధ్య తేడాను గుర్తించలేని నేత నుంచి ఇంతకంటే మరేం ఆశించగలమని మంత్రి విజయ్ కుమార్ చౌదరి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కులగణనకు కాంగ్రెస్ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. సర్వేలోని లోపాలను స్పష్టమైన ఆధారాలతో చూపిస్తే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అటు, ఈ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
Also Read: Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం – భయంతో పరుగులు తీసిన భక్తులు
మరిన్ని చూడండి