ISRO Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చారిత్రాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రయోగంలో మరో కీలక ముందడుగు పడింది. మానవసహిత అంతరిక్ష యాత్ర కలను సాకారం చేసుకునే దిశలో కీలక పరీక్షలో విజయవంతమైంది. గగన్‌యాన్ మిషన్ లో అత్యంత కీలకంగా భావించే ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరును మెరుగు పరిచేందుకు చేపట్టిన పరీక్ష సక్సెస్ అయింది. ఈ విషయాన్ని ఇస్రో గురువారం రోజు వెల్లడించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఈ పరీక్షలు నిర్వహించగా.. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు ప్రొపల్షన్ పనితీరును ధ్రువకీరించాయి. ఈ ఫలితాల ఆధారంగా ప్రొపల్షన్ ను శాస్త్రవేత్తలు మరింత మెరుగుపరచనున్నారు.
సర్వీస్ మాడ్యూల్-సిస్టమ్ డిమాన్స్ట్రేషన్ మోడల్ (SM-SDM) ఫేజ్-2 టెస్టుల్లో భాగంగా రెండో, మూడో హాట్ పరీక్షలను తాజాగా మహేంద్రగిరిలో నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని ఇంజిన్ల పనితీరును సమీక్షించారు. థ్రస్టర్ ఇంజిన్లను కంటిన్యూయస్, పల్స్ మోడ్ లలో విజయవంతంగా పరీక్షించారు. ఈ నెల 19వ తేదీన మొదటి హాట్ టెస్టును నిర్వహించగా.. రాబోయే రోజుల్లో మరో 3 హాట్ టెస్టులను నిర్వహించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత నిర్వహించబోయే టెస్టులో 350 సెకన్లను లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఈ టెస్టు ద్వారా చివరి కక్ష్యను చేరుకోబోయే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలో భాగంగా ఎల్ఏఎం ఇంజిన్లను కంటిన్యూయస్ మోడ్ లో, ఆర్సీఎస్ థ్రస్టర్లను పల్స్ మోడ్ లో పరీక్షిస్తారు.
Gaganyaan Mission:
Two more hot tests on the Gaganyaan Service Module Propulsion System were conducted successfully at IPRC/ISRO on July 26, 2023.
Tests were conducted in pulsed and continuous modes necessary for the mission.
Three more hot tests are scheduled to demonstrate… pic.twitter.com/Vn7BrzbpHE
— ISRO (@isro) July 27, 2023
ఒక్కో దశను పూర్తి చేస్తున్న ఇస్రో
మొదటి దశలో అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ పరీక్షను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా దీనిని గతేడాది నిర్వహించారు. తాజాగా.. రెండో దశ రికవరీ ట్రయల్స్ లో మాస్ అండ్ షేప్ సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ మోకప్ (CMRM) నిర్వహించారు.
ఇది టెస్టింగ్ ప్రక్రియలో ఒక కీలకమైన భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. CMRM వ్యోమగాముల దగ్గరకు సకాలంలో చేరుకోవడం, రికవరీ విధానాలు.. నిజ జీవిత పరిస్థితులను కచ్చితంగా అనుకిరంచేలా ఈ ట్రయల్స్ ఉంటాయి. దాని వల్ల గగన్‌యాన్ మిషన్ విజయానికి విలువైన మరింత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
మిషన్ గగన్‌యాన్ ఎలా సాగుతుందంటే..
భూమికి 400 కిలోమీటర్ల కక్ష్యలో మొదట వ్యోమగాములను ప్రవేశపెడతారు. మూడ్రోజుల తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు. తిరిగొచ్చే సమయంలో వ్యోమగాములు సముద్ర జలాల్లో పారాచూట్ల సాయంతో ల్యాండ్ అవుతారు. ఈ వ్యోమగాములను వేగంగా పికప్ చేస్తారు. ఇందుకోసం కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని నౌకాదళానికి చెందిన సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగకుండా, ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. గగన్‌యాన్ మిషన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండే అవకాశాలున్నాయి.