Israel Hezbollah Conflict: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధానికే (Israel Hamas War) ఇంకా తెరపడడం లేదనుకుంటే ఇప్పుడు మరో యుద్ధానికీ అంతా సిద్ధమవుతోంది. Hezbollah ఇజ్రాయేల్‌పై దాడి చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. యుద్ధం మొదలైతే అది తీవ్రతరంగానే ఉంటుందన్న అలజడి ఇప్పటికే మొదలైంది. ఫలితంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. లెబనాన్‌లోని హెజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అమెరికాతో పాటు అరబ్ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని మంతనాలు జరుపుతున్నాయి. అయితే..గాజాతో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి విరామమిస్తే హెజ్బుల్లా దాడులు ఆగే అవకాశముందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ..హమాస్‌పై దాడులను ఆపేందుకు ఇజ్రాయేల్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. పూర్తి స్థాయిలో హమాస్‌ని అంతం చేయాలన్న పట్టుదలతో ఉంది.
ఇందులో భాగంగానే రఫాపై విరుచుకుపడుతోంది. అయితే…అగ్రరాజ్యం ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది. హెజ్బుల్లా ఉగ్రవాదులకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అనవసరంగా కయ్యానికి కాలు దువ్వొద్దని తేల్చి చెప్పింది. నిజానికి 2006లోనే ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇజ్రాయేల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఈ సారి రక్షణ రంగాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నామని, హెజ్బుల్లా దాడులకు ప్రతిదాడులు తప్పకుండా చేస్తామని ఇజ్రాయేల్ స్పష్టం చేస్తోంది. అవసరమైతే AI టెక్నాలజీని కూడా వినియోగించి దాడులు చేస్తామని వెల్లడించింది.
ఇప్పటి వరకూ పూర్తిగా గాజాపై ఫోకస్ పెట్టిన ఇజ్రాయేల్ ఇప్పుడు (Israel Hezbollah War) ఆ ఫోకస్‌ని లెబనాన్ వైపు మళ్లిస్తోంది. రఫాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్స్‌కి బ్రేక్ ఇచ్చి సైన్యాన్ని లెబనాన్ మీదకు వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రధాని నెతన్యాహు. ఇజ్రాయేల్ సైన్యం లెబనాన్‌పై దాడులు మొదలు పెడితే మాత్రం అంతర్జాతీయంగా ఇది మరో అలజడిని సృష్టించే ప్రమాదముంది. ఇప్పటి వరకూ లెబనాన్‌పై చేసిన దాడుల కారణంగా దాదాపు లక్ష మంది వలస వెళ్లారు. దాదాపు 435 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్బుల్లా దళాలు తుపాకులు పట్టుకుని సరిహద్దు వద్ద సిద్ధంగా ఉన్నాయి. సరిహద్దుల్లో అప్పుడప్పుడూ జరిగిన దాడుల్లో 15 మంది ఇజ్రాయేల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
హెజ్బుల్లా నేత హసన్ నస్రల్లా గతేడాది అక్టోబర్ నుంచి ఒకే విషయం స్పష్టం చేస్తున్నారు. గాజాపై దాడులను ఆపేస్తే తప్ప ఇజ్రాయేల్‌పై తమ ఫోకస్‌ని తగ్గించలేమని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇజ్రాయేల్ పూర్తి స్థాయిలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినా అందుకు సిద్ధంగానే ఉన్నామని, కచ్చితంగా తిప్పి కొడతామని హెచ్చరిస్తున్నారు. గాజాతో యుద్ధం ఆపేంత వరకూ హెజ్బుల్లా ఇజ్రాయేల్‌ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెతన్యాహు మాత్రం హమాస్‌ని పూర్తిగా మట్టుబెట్టాలని సైన్యానికి ఆదేశాలిచ్చారు. ఇజ్రాయేల్ లెబనాన్ సరిహద్దుల్లో ఇప్పటికే అలజడి పెరుగుతున్న క్రమంలో నెతన్యాహు మనసు మార్చుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇజ్రాయేల్‌లోని హైఫా సిటీని టార్గెట్ చేశామని, ఏదైనా తేడా వస్తే పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని హెజ్బుల్లా ఇప్పటికే హెచ్చరించింది.
Also Read: NEET Issue: ఇకపై ఆన్‌లైన్‌లో నీట్ ఎగ్జామ్! పేపర్ లీక్ వివాదంతో కేంద్రం కసరత్తు – త్వరలోనే ప్రకటన!
మరిన్ని చూడండి