రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో చిక్కుల్లో ఇరుక్కున్నారు. 6,000 కోట్ల రూపాయల ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది. రాయ్‌పూర్, బిలాయ్ లోని ఆయన నివాసాలపై బుధవారం నాడు సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఇంటితో పాటు భిలాయ్‌లో ఆయన ఇంటిపై సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఆయనకు సన్నిహితుడైన పోలీస్ అధికారి నివాసంలోనూ దాడులు కొనసాగుతున్నాయి.

ఆరు వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నుంచి సీబీఐ దర్యాప్తును చేపట్టింది, ఈ విభాగం బాఘేల్‌తో పాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్ మరో 14 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు నేతలు, అధికారుల ప్రమేయం ఉందని తన దర్యాప్తులో తేలిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించింది. బాఘేల్ మాత్రం ఈ కేసును రాజకీయ కక్షతో నమోదు చేసిన కేసుగా పేర్కొన్నారు.

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు ఈ బెట్టింగ్ యాప్ ఒక సిండికేట్ ప్లాట్‌ఫారమ్‌ అని అధికారులు చెబుతున్నారు. కొత్త వినియోగదారులను యాడ్ చేసుకుని, యూజర్ ఐడీలను క్రియేట్ చేసి బినామీ బ్యాంక్ ఖాతాలతో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు.

భూపేశ్ బాఘేల్ ఇంట్లో ఈడీ దాడులు
మనీ వ్యవహారం కావడంతో ఈడీ సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో దుర్గ్ జిల్లాలోని 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మద్యం కుంభకోణం కేసులో భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య బాఘేల్ నివాసాలలో ఈడీ తనిఖీలు చేసింది.

ఈడీ దాడుల తర్వాత భూపేష్ బాఘేల్ మీడియాతో మాట్లాడుతూ.. తనిఖీలలో రూ.33 లక్షల నగదును గుర్తించింది. ఇది వ్యవసాయంతో పాటు కుటుంబసభ్యుల సేవింగ్స్ నగదు అని బాఘేల్ తెలిపారు. ఓ పెన్ డ్రైవ్ ఈడీ గుర్తించింది. కాగా, ఆ పెన్ డ్రైవ్‌లో రామన్ సింగ్ అల్లుడు మంతురామ్, పునీత్ గుప్తాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల సంభాషణ రికార్డ్ అయి ఉందన్నారు. సెయిల్ కంపెనీకి సంబంధించిన పత్రాల వివరాలు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ గుర్తించిన సొమ్ము తమ కష్టార్జితం అని, ఎలాంటి అవినీతి సొమ్ముకు ఆస్కారం లేదన్నారు. మా ఇంట్లో కట్టల కట్టల డబ్బులు ఉన్నాయని నిరూపించాలని తనిఖీలకు వచ్చిన అధికారులు క్యాష్ కౌంటింగ్ మేషీన్లు తీసుకువచ్చారని బాఘేల్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు జరుగుతున్నాయని, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు.