pakistan cricket board likely accept hybrid model in champions trophy with some conditions | Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్

Pakistan Cricket Board Accept Hybrid Model: ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 విషయంలో ఎట్టకేలకు పీసీబీ హైబ్రిడ్ విధానాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కొన్ని షరతులతో ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నట్లు సమాచారం. కాగా, వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 నిర్వహణ హక్కులను నవంబర్ 2021లో పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సొంతగడ్డపై బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లతో కలిసి టోర్నమెంట్ బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరింది.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ సైతం స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో బీసీసీఐ ప్రతిపాదనను పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ తెలపగా.. పాక్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మరోవైపు, భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను ఫణంగా పెట్టలేమని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్‌తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాక్ మాత్రం మొండి వైఖరిని ప్రదర్శించడంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించింది. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించాలని.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని పీసీబీకి అల్టిమేటం జారీ చేసింది.

3 షరతులతో అంగీకారం!

ఐసీసీ అల్టిమేటంతో పీసీబీ హైబ్రిడ్ విధానానికి అంగీకరించిందని ఇండియాటుడే కథనం పేర్కొంది. అయితే, పాకిస్థాన్ 3 షరతులు కూడా విధించినట్లు తెలిపింది.

  • టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్‌లో (ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లోనే నిర్వహించాలి.
  • ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలో నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు పీసీబీకి అనుమతి ఇవ్వాలి.
  • అటు, భవిష్యత్‌లో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్థాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించాలనే షరతులు విధించినట్లు సమాచారం.

అసలేంటీ హైబ్రిడ్ మోడల్? 

ఏదైనా దేశంలో పూర్తిగా టోర్నమెంట్ నిర్వహించలేని పరిస్థితుల్లో పలు దేశాల్లో వేదికలు ఖరారు చేస్తూ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఉదాహరణకు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ భద్రతా కారణాలతో టీమిండియా పాక్ వెళ్లేందుకు సిద్ధంగా లేదు. దాంతో భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంక, లేక భారత్‌లలో నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఒకే దేశం వేదికగా కాకుండా రెండు లేక అంతకంటే ఎక్కువ దేశాలు మెగా ఈవెంట్ నిర్వహించడాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఈ విధానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ప్రతిపాదించింది. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఇది తప్పదని స్పష్టం చేసింది.

కాగా, టోర్నీ షెడ్యూల్‌పై ఇప్పటికీ ఐసీసీ క్లారిటీ ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకూ జరగనుంది. హైబ్రిడ్ మోడల్‌కు పాక్ షరతులతో ఆమోదం తెలిపిన క్రమంలో అతి త్వరలోనే షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది.

Also Read: IPL 2025: ఐపీఎల్‌కు సెలక్ట్ అయిన సిక్కోలు కుర్రాడు, టాలెంట్ ఉంటే ఆసాధ్యం అనేదే ఉండదు

మరిన్ని చూడండి

Source link