అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ, ఆరుగురు మృతి!-annamayya district apsrtc bus oil tanker met accident six dead 10 more injured

Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పట్టారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లంపేట సమీపంలో జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ అతివేగంగా రావడమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఈ ప్రమాదంతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఓబులవారిపల్లె మండలానికి చెందిన గుండాల శ్రీనివాసులు(62), కడపకు చెందిన బాషా (65), రాజంపేట మండలానికి చెందిన శేఖర్‌ (45) మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. మిగిలినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో తిరుపతి శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Source link