అయ్యో.. ఉన్నదీ పాయే కదా జగన్..!

అవును.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ.. చెత్త అంటే చెత్త సలహాలు ఇస్తున్నారు..! కాస్తో కూస్తో ఉన్న పార్టీని ఒక స్టేజికి తీసుకురావడానికి సలహాలు ఇస్తున్నారో లేకుంటే సర్వనాశనం చేయడానికి ఇలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ.. చేజేతులా పార్టీని సర్వనాశనం చేసుకుంటున్నారనే మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతకీ ఇదంతా దేని గురించి అనే విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ..! అదేనండోయ్ ఢిల్లీ వేదికగా వైసీపీ చేపట్టిన ధర్నా, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించే ఇదంతా..! ఇంతకీ ఏం జరిగింది..? అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌కు వైఎస్ జగన్ ఎందుకు చెడ్డ అయ్యారనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.

ఇదీ అసలు సంగతి..!

కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీతో కాస్త అయినా సన్నిహిత సంబంధాలు ఉంటేనే మంచిది. అది కూడా వైఎస్ జగన్ లాంటివారికి ఎంతో అత్యవసరం కూడా. ఎందుకంటే అసలే నెత్తిన పాత కేసులు బోలెడన్ని కేసులున్నాయ్.. ఇప్పుడు దీనికి తోడు కూటమి సర్కార్ శ్వేతపత్రాలు, కుంభకోణాలు అంటూ ఒక్కొక్కటి వెలికి తీసే పనిలో నిమగ్నమైంది. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ దర్యాప్తు సంస్థ వచ్చి అరెస్ట్ చేస్తుందో..? ఎప్పుడు ఏపీ పోలీసులు తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగుపెట్టి అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త కేంద్రంలోని మోదీ సర్కార్‌తో ఫ్రెండ్లీగా ఉండి ఉంటే.. అదేనబ్బా గత ఐదేళ్లు ఉన్నట్లుగానే, ఈ ఐదేళ్లు కూడా చూసీ చూడటనట్లుగా కళ్లు మూసుకుని ఉంటే పోయేది కానీ.. అనవసరం ఢిల్లీ వేదిగా ధర్నా చేయడం ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వచ్చి సంఘీభావం ప్రకటించి మద్దతివ్వడంతో జగన్‌ ఊహించని వివాదంలో చిక్కుకున్నట్లు అయ్యింది. ఇన్నాళ్లు తెరవెనుక మిత్రుడిగా ఉన్న జగన్.. ఇప్పుడు ఇండియా కూటమి పార్టీలతో చేతులు కలపడంతో మోదీకి చిర్రెత్తుకొచ్చిందట. దీంతో అపాయిట్మెంట్ కూడా ఇవ్వకుండా.. కనీసం కేంద్ర మంత్రులతో కలవడానికి ఛాన్స్ లేకుండా చేసేశారు. ఇక చేసేదేమీ లేక ఢిల్లీ నుంచి తాడేపల్లికి వచ్చేశారు జగన్.

అవసరమా ఇవన్నీ..!

వాస్తవానికి వైఎస్ జగన్‌కు కేంద్ర ప్రభుత్వంతో ఎంత అవసరం ఉందో.. జగన్‌ రెడ్డితో కూడా కేంద్రానికి అంతే అవసరం ఉంది. ఎందుకంటే.. లోక్‌సభలు నలుగురే ఎంపీలు ఉన్నప్పటికీ రాజ్యసభలో వైసీపీ బాగా బలం ఉంది. దీంతో రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ మద్దతు లేనిదే అస్సలు అయ్యే పనే కాదు. అలాంటిది అనవసరంగా జగన్ ఢిల్లీకెళ్లి ధర్నా చేయడంతో ఇన్నాళ్లు మోదీతో ఉన్న తెరవెనుక దోస్తీ పాయే.. పోనీ ఇండియా కూటమికి అయినా దగ్గరయ్యారా..? అంటూ అదీ లేదు. కూటమిలోని పార్టీలు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్లు కాదన్న విషయం ఆలస్యంగా జగన్‌కు తెలిసొచ్చింది. ఉన్న మిత్రుడితో (మోదీతో) సర్దుకొని పోయి ఉంటే ప్రశాంతంగా ఉండేది కానీ.. కొత్త మిత్రులు సమాజ్ వాదీ పార్టీ, ఆప్, టీఎంసీ, శివసేన ఇలా కొత్త కొత్త మిత్రులు వచ్చేసరికి అసలు సిసలైన మిత్రుడికి బద్ధ శత్రువు అయ్యారు జగన్. అయినా ఢిల్లీలో ధర్నా చేయాలనే సలహా ఎవరిచ్చారో కానీ ఇంత చెత్తగా ఉందంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిట్టేస్తున్న పరిస్థితి. పోనీ ఇది సక్సెస్ అయ్యి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనుకో.. కానీ ఆశించిన రీతిలో అవ్వలేదు కదా. అది కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో తనకున్న పలుకుబడితో ఇంత చేశారు.. ఆయన లేకుంటే ఉన్న పరువు కాస్త ఢిల్లీలోనే పోయేదనే మాటలు విశ్లేషకుల నుంచి వస్తున్నాయ్. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో చూడాలి మరి.

Source link