మోత్కుపల్లి నర్సింహులు… తెలుగు రాజకీయాల్లో చాలా సీనియర్ నేత. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1989,1994,1999లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు మోత్కుపల్లి. ఆ తర్వాత ఆలేరులో ఓడిపోయారు. ఇదే టైంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో ఆలేరు జనరల్ సీటుగా మారింది. దీంతో వ్యూహం మార్చిన మోత్కుపల్లి… 2009 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి కూడా గెలిచారు. ఇక్కడి వరకు బాగానే సాగిన మోత్కుపల్లి రాజకీయం,,, తెలంగాణ ఉద్యమం తర్వాత సీన్ మారిపోయింది. తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్న మోత్కుపల్లి… కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే తెలంగాణకు మద్దతు విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇబ్బందిపడ్డారు. మరోవైపు పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. ఇదే టైంలో 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మదిర నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత… ఆయన గ్రాఫ్ మరింత పడిపోయింది. కానీ బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా.. మోత్కుపల్లికి గవర్నర్ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ అది కల గానే ఉండిపోయింది. ఆ తర్వాత టీడీపీని కూడా వీడిన ఆయన… 2018లో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి ఆలేరులో ఓడిపోయారు.