Cricket Betting : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్(Online Betting) లకు అలవాటు పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటిపై పోలీసులు ఎంత అవగాహనా కల్పిస్తున్నా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్(IPL) సీజన్ నడుస్తుతుండడంతో క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి ఆన్లైన్ యాప్స్ లో, స్నేహితుల దగ్గర అప్పులు చేసి బెట్టింగ్ లో పెట్టి తీవ్రంగా నష్టపోయాడు ఓ యువకుడు. తల్లిదండ్రులకు చెప్పలేక, అప్పులు తీర్చే మార్గం కనపడక మనోవేదనకు గురైన బీటెక్ విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది
సంగారెడ్డి (Sangareddy)జిల్లా సదాశివపేట పట్టణం గొల్లకేరి ప్రాంతానికి చెందిన చింత ఆదర్శ్ కుమార్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు చింతా వినీత్ (24) ఘట్కేసర్ గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వినీత్ కొంతకాలంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ (Online Cricket Betting)ఆడుతున్నాడు. దీని కోసం ఆన్లైన్ యాప్స్(Loan Apps),స్నేహితుల దగ్గర నుంచి రూ. 25 లక్షల వరకు అప్పుగా తీసుకొని ఐపీఎల్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అప్పుల విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో వారికి చెప్పలేక తిరిగి ఆ డబ్బులు చెల్లించలేక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. కాగా రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు అయోధ్య(Ayodhya) రాముని దర్శనానికి వెళ్లారు. దీంతో మరల అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికమవ్వడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న వినీత్ శనివారం ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న వినీత్ తల్లితండ్రులు అయోధ్య నుంచి హుటాహుటిన సంగారెడ్డికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరగాని వలలో చిక్కుకున్న బాధితుడు
సిద్ధిపేట జిల్లా(Siddipet) దుబ్బాక పట్టణానికి చెందిన యువకుడికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు(Cyber Crime) ఫోన్ చేసి SBI నుంచి మాట్లాడుతున్నామని మీ క్రెడిట్ కార్డ్స్(Credit Card) కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పాడు. సైబర్ నేరగాడు చెప్పగానే అది నమ్మిన యువకుడు కార్డ్స్ నెంబర్, ఓటీపీ నెంబర్ చెప్పగానే అకౌంట్లో నుంచి రెండు విడతలుగా రూ.1,34,000 పోయాయి. అనుమానం వచ్చిన యువకుడు వెంటనే సైబర్ సెల్(Cyber Cell) నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఏసీపీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ ఆర్థిక నేరాలలో ఎవరైనా బాధితులు ఒక లక్ష రూపాయల నుంచి ఆపై డబ్బులు పోగొట్టుకున్న వారు వెంటనే జాతీయ సైబర్ సెల్ నెంబర్1930 ఫిర్యాదు చేయాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. లేదా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in వివరాలు నమోదు చేయవచ్చని తెలిపారు.