Hyderabad Crime : తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల కోసమే చేస్తారు. వారి భవిష్యత్తు బాగుండాలని కొన్నిసార్లు హెచ్చరిస్తుంటారు. తమ బిడ్డల కోసం ఎన్నో కలలు కంటూ రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అయితే తల్లిదండ్రులు తిట్టారనో, స్వేచ్ఛగా తిరగనివ్వడంలేదనో ఆత్మహత్యలు చేసుకోవడం, ఇళ్లు వదిలి పారిపోయిన ఘటనలు చూసుంటారు. అయితే ఓ యువతి మాత్రం తండ్రి మందలించాడని అతడినే హత్య చేసింది. హైదరాబాద్ అంబర్ పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబర్ పేటలో నివాసం ఉంటున్న జగదీష్ కు నిఖిత అనే కూతురు ఉంది. నిఖిత అఫ్జల్ గంజ్ లోని ఒక షాపులో పనిచేస్తుంది. అయితే నిఖిత దుకాణంలో పనిముగిశాక ఇంటికి ఆలస్యంగా వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి… కూతురును మందలించాడు. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని, తొందరగా రావాలని తిట్టాడు. అయితే నిఖిత కోపంతో తండ్రితో వాగ్వాదానికి దిగింది. ఆవేశంలో నిఖిత పక్కనే ఉన్న గాజు సీసాతో తండ్రి జగదీష్ మెడ భాగంలో పొడిచింది. జగదీష్ గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చారు. తీవ్రరక్తస్రావంతో పడిపోయిన జగదీష్ ను ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిఖితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.