Adilabad News : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ మండల కేంద్రం చూసిన టెంట్లు కనిపిస్తున్నాయి, నిరసన గళాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరసనలలో భాగంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట, డివిజన్ కార్యాలయం ఎదుట, కలెక్టర్ కార్యాలయం ఎదుట వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులుగా అంగన్వాడీలు వివిధ రకాలుగా నిరసనలు చేస్తుండగా, మరోవైపు ఆశా కార్యకర్తలు, పంచాయతీ ఆపరేటర్ లు, మధ్యాహ్న భోజన కార్మికులు టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీలు బిక్షాటన చేస్తూ ఆయాలు కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఇదే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం 3000 పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం ప్రకటించిందని, వెంటనే అమలు చేసి ఏరియర్స్ తో సహా చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ డిమాండ్ చేసింది.