Kumbam Anil Kumar Reddy : భువనగిరి కాంగ్రెస్ లో వర్గపోరు మొదలైంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో తనను ఓడగొట్టేందుకు రహస్య మంతనాలు చేస్తున్నారన్నారు. ఎంపీ కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తన అనుచరులతో వలిగొండ, బీబీనగర్‌లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి వైఖరిని నిరసిస్తూ భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తన కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డిపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు.