ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా, ఒడిశా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల నిర్వహించనున్నారు. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.