బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్.. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే డిసైడ్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో బీజేపీ మహాజన్సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ… దాదాపు 30 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కేసీఆర్ సిద్ధం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో 45 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందనడం హాస్యాస్పదమన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్ సీనియర్లే అంటున్నారన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చేశారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలోని మంచి పథకాలు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ధరణి మంచి పథకమే కానీ కేసీఆర్ కుటుంబానికి అనువుగా మార్చుకున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ లో మార్పులు చేసి కొనసాగిస్తామన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌కు భయంపట్టుకుంటుందన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బీఆర్ఎస్ చేరుతారని ఆరోపించారు.