కేటీఆర్‌ను అడ్డంగా బుక్ చేసిన హరీష్!

అవును.. మీరు వింటున్నది, చదువుతున్నదీ అక్షరాలా నిజమే. నిండు అసెంబ్లీలో కేటీఆర్‌ను హరీష్ రావు అడ్డంగా బుక్ చేసేసారు. ఇదేంటి వాళ్ళు ఇద్దరూ బావ బామ్మర్దులు కదా.. అంతా ఒక్కటే అని అనుకుంటున్నారు కదూ.. అవును కానీ హరీష్ నోట వచ్చిన మాట అలాంటిది మరి. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓఆర్ఆర్ లీజు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడగా దీనికి కౌంటర్ ఇవ్వబోయిన మాజీ మంత్రి హరీష్ రావు ఇంకేదో మాట్లాడారు. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు.

 

తథాస్తు..!

హరీష్ డిమాండ్, మాటల మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రే.. ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ వేయండని డిమాండ్ చేశారు. వారు మనస్ఫూర్తిగా విచారణకు అడిగారో.. వారి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నాను అని రేవంత్ ప్రకటన చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఆదేశాలు జారీ చేయడం సిట్ అధికారులు తేల్చకపోవడమా..? కచ్చితంగా కేటీఆర్ కు మరిన్ని కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు.

 

టార్గెట్ కేటీఆర్..!

కేసీఆర్ పదేళ్ల సర్కారుపై ఎప్పుడెప్పుడు అవినీతి ఆరోపణలు వస్తాయా..? ఎవరిని ఎక్కడ.. ఎప్పుడు అరెస్ట్ చేయాలని ఉవ్విల్లూరుతున్న ముఖ్యమంత్రికి కేటీఆర్ దొరకనే దొరికారు. ఇప్పటికే అదిగో.. ఇదిగో అని బాంబులు (పొంగులేటి రోజుకో బాంబు) పేల్చారే తప్ప.. అరెస్ట్ జరగలేదు. ఐతే ఇప్పుడిక కేటీఆర్ టార్గెట్ అంటూ తెలంగాణ సర్కార్ యమా దూకుడు పెంచింది. రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో ఏ-1గా కేటీఆర్ ఉన్నారు. ఓఆర్ఆర్ అంశంలోనూ కేటీఆర్ టార్గెట్ అంటూ సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ లీజుపై సిట్ కొరడా ఝళిపించనుంది. 

 

అవసరమా హరీష్..!

దీన్ని బట్టి చూస్తే ఒకవేళ కారు రేసులో అరెస్ట్ అయినా.. లేదా అరెస్ట్ అయ్యి బయటికి వచ్చినా కష్టాలు ఐతే తప్పేలా ఏ మాత్రం అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. హరీష్ అసెంబ్లీ పంతాలు, పట్టింపులకు పోకుండా ఉండుంటే కాస్త ఐనా రిలీఫ్ ఉండేది కదా గులాబీ శ్రేణులు, కేటీఆర్ వీరాభిమానులు, అనుచరులు ఒకింత నిట్టూరుస్తున్నారు. అదేదో అంటారే ఇరుక్కుపోయి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అంటారే అలా ఉంది హరీష్ దెబ్బ. దీనికి తోడు కేటీఆర్ అంటే బావకు ఎందుకు అంత కోపం అంటూ కొందరు నేతలు సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్ముందు ఇంకా ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి మరి.

Source link