Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం గండికోట రిజర్వాయర్ ను సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద నిలిచిన పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… పాత ప్రాజెక్టులను పూర్తి చేయలేని సీఎం జగన్, కొత్త ప్రాజెక్టుల పేరుతో రూ.12 వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ. 600 కోట్ల బిల్లులను ఇచ్చారని తెలిపారు. పాత ప్రాజెక్టులు రద్దుచేసి.. 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందన్నారు. గత నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. నెలకోసారి దిల్లీ టూర్ కు వెళ్లే సీఎం జగన్… ఈ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ, ఎన్జీటీ, సీడబ్ల్యూసీ అనుమతులు తేలేకపోయారని విమర్శించారు.