Chittoor Crime : చిత్తూరు జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం దేవలకుప్పం అటవీ ప్రాంతంలో గొర్రెలను మేతకు తోలుకెళ్లారు ముగ్గురు యువకులు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొన్ని గొర్రెలు కనిపించకపోవడంతో యువకులు అటవీ ప్రాంతంలోకి వెతికేందుకు వెళ్లారు. గొర్రెలను వెతికే క్రమంలో అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి గంగాధర్(20) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన గంగాధర్ కు ఇటీవలె వివాహం జరిగింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ తీగలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.