జగన్ కోసం క్షణం వేస్ట్ చేయొద్దు!

అవును.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం క్షణం కూడా వేస్ట్ చేయొద్దు..! అంతేకాదు.. జగన్, వైసీపీ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు..! ఆయన గురించి ఆలోచించే సమయాన్ని కూడా రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలి..! ఇవీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు, ఎంపీల మధ్య జరిగిన సంభాషణ. జులై-22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఒకే ఒక్కటి అంతే..!

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ చేస్తానన్న ధర్నా గురించి ఒకరిద్దరు ఎంపీలు ప్రస్తావనకు తెచ్చారు. వెంటనే కలుగజేసుకున్న సీనియర్ ఎంపీలు.. అబ్బే లైట్.. జగన్‌, వైసీపీ గురించి ఆలోచన అవసరం లేదని ఒక్క మాటలతో తీసిపడేశారు.! ఒక్కటంటే ఒక్క క్షణం కూడా జగన్‌ గురించి ఒక్క క్షణం ఆలోచించనక్కర్లేదని.. ఆ సమయాన్ని కూడా రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నట్టు తెలిసింది. మరో సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే.. జగన్ పేరెత్తగానే ఒంటికాలిపై లేచి మాట్లాడరట.

అవును అక్కర్లేదు..!

ఎంపీల మాటల తర్వాత చంద్రబాబు స్పందిస్తూ.. అవును మీరు చెప్పింది అక్షరాలే నిజమేనన్నారు. అయితే.. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారనేది ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తమ్మీద.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని ఎంపీలకు సూచించారు. అదేవిధంగా.. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని బాబు కీలక సూచన చేశారు. ఇందుకుగాను అవసరమైతే.. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను కూడా వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు. చూశారుగా.. టీడీపీ సంగతి అటుంచితే, ఎంపీల దృష్టిలో వైఎస్ జగన్ ఎక్కడున్నారో అర్థమైంది కదూ..!

Source link