నేనే గెలుస్తా, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు నాకే ఓట్లు వేస్తారు, నేను ప్రజలకు పథకాలిచ్చాను, దత్తపుత్రుడు, చంద్రబాబు ముసలివాడు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఏపీకి ఏమి చెయ్యరు అంటూ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అనే ధీమాను ప్రదర్శించి ఎలక్షన్ అవ్వగానే ఫ్యామిలీ ట్రిప్ అంటూ లండన్ వెళ్ళిపోయి.. కౌంటింగ్ ముందు మళ్ళీ తాడేపల్లిలో దిగాడు.
జూన్ 6 వైసీపీ కి మరిచిపోలేని రోజుగా ఏపీ ప్రజలు మార్చేసారు. వైసీపీ ని అధః పాతాళానికి తొక్కిపారేసారు. మంచిచేసి ఓడిపోయామంటూ తాడేపల్లి వెళ్లి అక్కడి నుంచి పులివెందుల కి అటు నుంచి అటే బెంగుళూరు వెళ్ళిపోయిన జగన్ ఆ తర్వాత పిన్నెల్లి పరామర్శతో తిరిగి తాడేపల్లి వచ్చాడు. వినుకొండ ఘటనతో ఢిల్లీలో ధర్నా అని మొదలు పెట్టి మళ్ళీ బెంగుళూరు చెక్కేసిన జగన్ ని సొంత నేతలే విమర్శిస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఓటమి తర్వాత కూడా పాఠం నేర్వలేదు అంటూ తల పట్టుకున్నారు.
జగన్ పెంచి పోషించిన బ్లూ మీడియా కూడా జగన్ వ్యవహారం పై పదే పదే వెటకారపు రాతలు రాస్తుంది. జగన్ మారాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి అంటూ నినాదం చేస్తుంది. మరి ఇప్పుడు జగన్ లో మార్పు మొదలయ్యిందా అంటే మొదలయ్యింది అనే చెప్పాలి. నిన్న బెంగుళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో వైసీపీ క్యాంప్ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలను కలవడం చూసిన వారు జగన్ లో మార్పు మొదలయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
గతంలో అంటే 2019 లో గెలిచాక జగన్ వైసీపీ కేడర్ ని పట్టించుకున్న పాపాన పోలేదు. వాలంటీర్లంటూ వాళ్ళని నమ్మి వైసీపీ కార్యకర్తలను జగన్ పట్టించుకోలేదు. దానితో వైసీపీ ఓటమి లో కార్యకర్తల నిర్వేదం కూడా ఉంది అనేది వాస్తవం. కానీ ఇప్పుడు జగన్ ఓటమి తర్వాత వస్తున్న విమర్శలతో మారినట్లుగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణే ఈరోజు క్యాంప్ ఆఫీసులో వైసీపీ కేడర్ ని, అభిమానులను కలిసి వినతులు స్వీకరించడం. మరి అదేదో అప్పుడే చేస్తే ఈగతి పట్టేది కాదుగా అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.