India vs Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా నేడు (జూలై 16) జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో 40 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. వన్డేల్లో బంగ్లా చేతిలో భారత మహిళల జట్టు ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం పడటంతో ఈ మ్యాచ్‍ను 44 ఓవర్లకు అంపైర్లు కుదించారు. మిర్పూర్ వేదికగా జరిగిన ఈ తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత పేసర్ అమన్‍జోత్ కౌర్ అరంగేట్ర మ్యాచ్‍లో అదరగొట్టి నాలుగు వికెట్లు పడగొట్టింది. వేదిక వైద్యకు రెండు, దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక టీమిండియా ఓడిపోయింది. 35.5 ఓవర్లలోనే 113 పరుగులకే భారత జట్టు ఆలౌటైంది. దీప్తి శర్మ (20) మినహా భారత బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు. బంగ్లా బౌలర్లలో మరుఫా అక్తెర్ నాలుగు, రబేయా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో వన్డేల చరిత్రలో భారత మహిళల జట్టుపై బంగ్లా తొలిసారి విజయాన్ని నమోదు చేసుకుంది.