US Military Plane Departs With Indian Migrants | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. ఇదివరకే బైడెన్ ప్రభుత్వం జీవోలను రద్దు చేసిన ట్రంప్.. విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల బహిష్కరణకు శ్రీకారం చుట్టారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌కు సైతం ట్రంప్ షాకిచ్చారు. మన దేశానికి చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం అమెరికా నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
భారత్‌కు బయలుదేరిన విమానం
సీ17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో అమెరికా నుంచి అక్రమవలసదారులను భారత్‌కు తిరిగి పంపిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. బయలుదేరిన 24 గంటల్లో ఈ విమానం భారత్‌కు చేరుకోనుంది. అయితే ఎంత మందిని అందులో తరలించారనేది తెలియాల్సి ఉంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ నినదించారు. విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వారి కంటే అమెరికా పౌరులకే తన ప్రాధాన్యమని నడుచుకున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపారు.
జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
ఇదివరకే 538 మందిని అక్రమ వలసదారులను వారి దేశాలకు తరలించారు. తాజాగా టెక్సాస్, శాన్ డియాగో, ఎల్ పాసో, కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న మరో 5,000 మంది అక్రమ వలసదారులను గుర్తించిన అమెరికా అధికారులు వారిని స్వదేశాలకు పంపేందుకు చర్యలు చేపట్టింది. ఇదివరకే 6 విమానాలలో అక్రమ వలసదారులను లాటిన్ అమెరికాకు తరలించారు. సీ17 కార్గో విమానాలలో అక్రమ వలసదారులను వారి దేశాలను తిరిగి పంపిచేస్తున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తెలిపారు. విదేశాల నుంచి అక్రమంగా వచ్చి అమెరికాలో ఉండటంతో దేశ పౌరులపై ప్రభావం చూపుతుందన్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు.
భారత్‌కు చెందిన 7,25,000 మంది వలసదారులు సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్‌కు తరలించేందుకు ట్రంప్ ప్రభుత్వం జాబితా రెడీ చేసింది. అక్రమ వలసదారులతో అమెరికాకు తీవ్ర నష్టమని, నేరాలకు అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. వీసా గడువు ముగిసిన వారైన, లేక సరైన డాక్యుమెంట్ పేపర్స్ లేనివారు, సంబంధిత వ్యక్తులను అక్రమ వలసదారులుగా అమెరికా గుర్తిస్తోంది. అమెరికా నుంచి తిరిగి రావడానికి ఇబ్బంది పడుతున్న వారికి, అమెరికాలో ఉంటున్న వారికి సైతం తాము అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
కెనడా, మెక్సికోకు స్వల్ప ఊరట
మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం సుంకాల అమలు నిర్ణయాన్ని నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మెక్సికో, కెనడా దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని, అక్రమ వలసలు లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ట్రంప్ కాస్త తగ్గారు. మత్తు పదార్థాలు, మనుషులు గానీ అమెరికాలోకి అక్రమంగా వచ్చారని తెలిస్తే కఠిన ఆంక్షలు, టారిఫ్ లు విధిస్తామని కెనడా, మెక్సికోలను ట్రంప్ హెచ్చరించారు.
Also Read: Panama Canal: పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకోనున్న అమెరికా!.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని చూడండి