రాగల మూడు రోజుల్లో వడగాలులు
తెలంగాణలోని నేడు, రేపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాగల మూడు రోజులు ఎండలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. నేడు, రేపు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. ఎల్లుండి రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజులలో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని వెల్లడించారు.