నటి కృష్ణవేణి కూతురు అనురాధ దేవిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు,
నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. కృష్ణవేణి గారిని కోల్పోవడం, మా కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు అనిపిస్తుంది. మా నాన్న గారి చలన చిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి సినిమా మన దేశం చిత్రంతో చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దానికి కృష్ణవేణి గారే నిర్మాత అంటూ కృష్ణవేణి మృతి పట్ల ఆయన సంతాపాన్ని తెలియజేసారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. మా నాన్న గారు ఓ యాక్టర్ గా పరిచయం చేసిన ఆ మహాతల్లిని కోల్పోవడం మా కుటుంబ సభ్యురాలిని కోల్పోయినంత బాధ కలుగుతుంది. కృష్ణవేణి గారి మరణం మా కుటుంబానికి తీరని లోటు. డిసెంబర్ లో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను ఆ సభలో మాట్లాడే ముందు ఆవిడకు పాదాభివందనం చేసిన తర్వాతే మాట్లాడాను. ఆ భాగ్యం నాకు కలిగింది.
టిడి జనార్దన్ మాట్లాడుతూ.. అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ స్థాపించి మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా అన్నగారి శతజయంతి ఉత్సవాల్లోను, అన్నగారి సినీ వజ్రోత్సవ ఉత్సవాల్లోను కృష్ణ వేణి అమ్మగారు పాల్గొన్నారు. అప్పటికే ఆమెకు 100 సంవత్సరాలు నిండినాయి. వైద్యులు ఆమెను వెళ్లడం అంత మంచిది కాదు అని చెప్పినా ఆవిడ వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావడం అదీ అన్నగారి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలుగుతుంది, నా ఆయుష్షు పెరుగుతుంది అని చెప్పారావిడ. అలా ఆవిడ రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మూడు గంటల వజ్రోత్సవ సభలో ఆవిడ కూర్చోవడం ఇబ్బంది కలుతుందేమో అని చంద్రబాబు గారు అడిగితే.. లేదు నేను చివరివరకు ఉంటాను అని ఆఖరివరకు ఉండి వెళ్లారు. ఆవిడ ఈరోజు మానమధ్యనలేకపోవడం చాలా బాధాకరం, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన మహానటుడు నందమూరి తారకరామారావుగారిని తెరకు పరిచయం చెయ్యడం, అలాగే ఎందరో మహానటులు, ఘంటసాల లాంటి గాయకులను కృష్ణవేణి గారు తెలుగు తెరకు పరిచయం చేసారు. అలాంటి మహానుభావురాలు నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించడమే కాకుండా చలనచిత్ర పరిశ్రమకు అనేక సేవలందించారు. మహానటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, మంచి గృహిణిగా సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు పైగా పూర్తి చేసుకుని ఈరోజు మన మధ్యన లేకపోవడం తీరని లోటు అన్నారు.
ఈకార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణతో పాటు టిడి జనార్దన్, ప్రసన్న కూమార్, భారత్ భూషణ్, దాము, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జర్నలిస్టు ప్రభు, ఆచంట గోపినాథ్, ముత్యాల రామదాసు పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూల మాలలు వేసి సంతాపం తెలిపారు. ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.