ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ… నవంబర్ 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పీఏ సిస్టమ్, ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.