Minister KTR : కాంగ్రెస్, బీజేపీలు దిల్లీ వదిలిన బాణాలు, కానీ తెలంగాణ గల్లీ నుంచి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్… ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలకు వరుసగా కౌంటర్లు ఇస్తూ… ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు. నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ది మెరుపు వేగం, అమలు చేయడంలో రాకెట్ స్పీడ్ అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం, పార్టీలో నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం, సాహసం, తెలువ, తెలివి , వెన్నుముక ఉన్న నాయకుడు కావాలన్నారు. అలాంటి నాయకుడు కేసీఆర్ మాకున్నారన్నారు. దిల్లీ పార్టీలో నిర్ణయాలు తీసుకునేలోపు ఇక్కడ ప్రజలు చస్తారన్నారు. మాది గల్లీ పార్టీ ఏ నిర్ణయం అయినా మెరుపు వేగంతో తీసుకుంటామన్నారు. రాజకీయాలు, ప్రజాజీవితం అంటే టెన్ జన్పథ్ కాదని, తెలంగాణ జనపథంతో కలిసి కదం తొక్కితే అప్పుడు ఆదరణ ఉంటదన్నారు. టెన్ జన్పథ్ చుట్టూ చక్కర్లు కొడితే మీ వల్ల ఏం కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.