Old City Metro Rail : పాతబస్తీకి మెట్రో సేవలు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో మెట్రో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మధ్య మెట్రో రైలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. నెలరోజుల్లో భూసేకరణకు నోటీసులు జారీ చేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్ లో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, మెట్రో విస్తరణలో భాగంగా వీటిని తొలగించాల్సి ఉందన్నారు. ఎక్కువగా కట్టడాలను కూల్చకుండా 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేసి ఈ మార్గంలో మెట్రో పనులు ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.