పార్టీలు కాదు.. శిక్షపడేలా చూడాలబ్బా!

అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక ట్రెండ్ అయిపోయింది..! ఇందులో ఏ పార్టీ తక్కువేం కాదు.. వైసీపీని మించి టీడీపీ ఉంటే ఈ రెండింటికీ మించి జనసేన పార్టీ ఉంది.. ఇక బీజేపీ అంటారా అబ్బో తక్కువేమీ కాదు! ఏపీలో ఎక్కడ ఏం జరిగినా సరే.. తొలుత ఆ ఘటనకు పాల్పడిన సదరు వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడు..? పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ..? గతంలో ఏంటి..? ఇప్పుడు ఏంటి..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని విషయాలు ఒకరిపై ఒకరు పోటీగా బయటికి తీస్తూ రచ్చ చేస్తే అసలు విషయం ఏమవుతుంది..? అసలు ఇలా చేయడం వల్ల పైసా ప్రయోజనం ఏమైనా ఉందా..? అనేది ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కాని విషయం.

ఏమైంది.. ఎందుకు?

రోడ్ యాక్సిడెంట్ మొదలుకుని అత్యాచార ఘటనల వరకూ ఆంధ్రాలో ఏం జరిగినా సరే.. మీడియాలో రావడానికి ఐనా ఆలస్యం అవుతుందేమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఘటనకు సంబంధించి ఫుల్ డిటైల్స్ అన్నీ నిమిషాల్లోనే దర్శనం ఇస్తున్నాయి. ఇందుకు ప్రత్యేకించి ఉదాహరణలు మరీ చెప్పనక్కర్లేదు. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనే చక్కటి ఉదాహరణ. కాలేజీలోని అమ్మాయిల బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు ఘటనతో యావత్ సభ్య సమాజం తలదించుకుంటోంది. ఇందులో కర్త, కర్మ క్రియ అంతా.. ఇదే కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ద్వారా హిడెన్ కెమెరాలు హాస్టల్ బాత్రూములో ఫిక్స్ చేపించిన ఆ యువకుడు ఫోన్, ల్యాప్టాప్ ద్వారా మొత్తం ఆపరేట్ చేసాడంట. ఇలా మొత్తం 300 లకు పైగా వీడియోలు బయటికి వచ్చాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. వీళ్ళు చేసిన పనికి ఒకరు ఇద్దరూ కాదు వందలమంది విద్యార్థినీలు తల ఎత్తుకొని తిరగలేని బయటికి పరిస్థితి.

ఇదేనా కావాల్సింది..?

ఈ కాలేజీ ఘటనలో అమ్మాయి.. టీడీపీ నేత కుమార్తె అని, అబ్బాయి జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వారి ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం వీడియోలు, పోస్టులను బట్టి చూస్తే అర్థం అవుతోంది కూడా. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సదరు కాలేజీ యజమాని టీడీపీ సానుభూతిపరుడు అని, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు అని వైసీపీ తెగ హడావుడి చేస్తోంది. ఇంత జరిగిన తరువాత ఈ చెత్త పనులు చేసిన.. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది..? కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించేలా డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని వదిలేసి.. ఇదిగో వీడు మీ వాడే, మీ పార్టీ వాళ్ళు అంతా ఇంతే.. అంటూ టీడీపీ, వైసీపీ, జనసేన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే సరిపోతోంది. ఒకరినొకరు కార్నర్ చేసుకోవడం, డిఫెండ్ చేయడమే సరిపోతోంది. ఇదేనా ప్రజలకు పార్టీలు, కార్యకర్తలు ఇచ్చే సందేశం. 

ఇది కదా కావాల్సింది..!

ఈ యదవ పని చేసిన వ్యక్తి ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే.. ఆ బాధితుల్లో మన అక్కో, చెల్లో ఉంటే ఏంటి పరిస్థితి.. మనవాళ్ళు ఉంటే ఎలాంటి పోరాటం చేస్తామో అలా చేయాల్సిన, శిక్ష పడేవరకూ పోరాటం చేయాల్సిందే.. అంతకుమించి ఇలాంటి పనులు చేయాలంటే కాదు.. చేయాలనే ఆలోచన వస్తేనే భయపడిపోయేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే తాట తీసిపడేయాలి అంతే. ఇది కదా కావాల్సింది.. చేయాల్సింది..! ఇదిగో పలానా పార్టీ అని చెప్పుకునే తమరు వెళ్లి ధర్నా చేయండి.. ఆందోళన చేయండి.. మన తోడబుట్టిన అక్క, చెల్లమ్మలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయండి.. అంతే కానీ దయచేసి ఇకనైనా పార్టీలు, పంథాలు, పట్టింపులకు పోకుండా ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఆలోచిస్తే అదే పదివేలు..!

ఏది నిజం..!

హిడెన్ కెమెరాలు నిజమే అని వందలాది విద్యార్థినులు కంటతడి పెట్టుకొని చెబుతుంటే.. కెమెరాలు లేవు, ఏమీ లేవు అని స్వయంగా సీఎం చంద్రబాబు, ఎస్పీ గంగాధర్ చెబుతూ ఉండటం గమనార్హం. బాలికల హాస్టల్‌లో రహస్య కెమెరాలు లభించలేదని.. నిందితుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరిశీలించామని విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తప్పుచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఇదంతా వారం రోజులుగా నడుస్తున్నా బయటికి పొక్క నీయకుండా చేశారని స్టూడెంట్స్ మొత్తుకుంటున్నారు. వారం నుండి చెప్తున్నా యాక్షన్ తీసుకోలేదు.. ఇప్పుడు ఆందోళన చేస్తున్న మా మీద రివర్స్ కేసులు పెడతాం అంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, నేతలు మొదలుకుని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్న పరిస్థితి. కార్యకర్తలు కొట్టుకున్నట్టుగానే ప్రభుత్వం కూడా మనోడే, మనోళ్లే, మన పార్టీనే కదా అని లైట్ తీసుకుంటుందో లేకుంటే.. కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వ పెద్దలు చూస్తారో చూడాలి మరి.

Source link