Unnamed Railway Station In India: ఇండియాలో 7000 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ల్లో ఇండియన్ రైల్వేస్ కూడా ఒకటి. అంత పెద్ద నెట్‌వర్క్‌లో పేరు లేని రైల్వే స్టేషన్ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా. అక్కడ ప్లాట్ ఫామ్ ఉంటుంది స్టేషన్ ఉంటుంది కానీ ఆ రైల్వే స్టేషన్‌కి పేరు ఉండదు. ట్రైన్ ఆగిన తర్వాత ప్లాట్‌ఫాంపై దిగిన ప్రయాణికులు అయోమయానికి గురై స్టేషన్లో ఉన్న స్థానికుల్ని అడిగి ఎక్కడ దిగామో కన్ఫామ్ చేసుకుంటూ ఉండడం చాలా సహజమైపోయింది. ఇంతకూ ఆ స్టేషన్ ఎక్కడ ఉంది.. తెలుసుకుందాం
వెస్ట్ బెంగాల్‌లోని వింత రైల్వే స్టేషన్
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్‌లోని బురద్వాన్ జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఆ జిల్లాలోని రాయ్‌నగర్ ఊళ్లో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది. బంకురా -దామోదర్ నేరో గేజ్ రైల్వే లైన్ రాయ్ నగర్ గుండా వెళ్ళేది. 2008లో అది బ్రాడ్ గేజ్ ద్వారా హౌరా మెయిన్ లైన్‌కు కలిపారు. అప్పుడు కొత్త స్టేషన్ ఏర్పాటు చేస్తూ పాత స్టేషన్‌కి 200 మీటర్ల దూరంలో దాన్ని నిర్మించారు.
గొడవ అక్కడే స్టార్ట్ అయింది. కొత్తగా కట్టిన స్టేషన్ రాయ్ నగర్ పరిధిలోకి రాదు తమ ఊరికే చెందుతుంది అని రైనా ఊరి వాళ్ళు వివాదానికి తెర తీశారు. కొత్త స్టేషన్‌కి ‘రైనా’ అని తమ ఊరి పేరే పెట్టాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆ గొడవ తారాస్థాయికి చేరడంతో చివరికి ఆ స్టేషన్ బోర్డు మీద ఏ పేరు రాయకుండా అలానే వదిలేసారు. గడిచిన 17 ఏళ్లుగా ఆ స్టేషన్ బోర్డుపై ఎలాంటి పేరు లేకుండానే కాలం గడిచిపోతుంది
రైల్వే స్టేషన్ బోర్డు కోసం కోర్టుకు వెళ్లిన “రైనా” ఊరి ప్రజలు
ఊరి పరిధిలో కట్టిన స్టేషన్‌కు తమ ఊరి పేరే ఉండాలంటూ “రైనా” గ్రామ ప్రజలు జిల్లా కోర్టులో పిటిషన్ సైతం వేశారు. కానీ అది రైల్వే బోర్డు నిర్ణయం కోర్టు తేల్చి చెప్పింది. రైల్వే శాఖ మాత్రం ఇప్పటికీ ఆ బోర్డుపై ఏ పేరు ఉండాలి అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ స్టేషన్లో బంకురా నుంచి మసాగ్రామ్ మధ్య తిరిగే ప్యాసింజర్ రైలు ఆరు రోజులు రోజుకి ఆరుసార్లు ఆగుతుంది. ప్రస్తుతానికి స్టేషన్ మాస్టర్ టికెట్లు మాత్రం పాత రైల్వే స్టేషన్ “రాయ నగర్ ” పేరు మీదనే ఇస్తారు. కానీ స్టేషన్లో ఉండే వాళ్ళు మాత్రం దాన్ని ” రైనా “రైల్వే స్టేషన్ అని పిలుస్తారు. పాత వాళ్లకు ఓకే గాని ఎవరైనా కొత్త ప్రయాణికులు అక్కడ దిగితే తాము దిగింది ఏ స్టేషనో కన్ఫార్మ్ చేసుకోవడానికి కాస్త తికమక పడుతూ ఉంటారు. స్టేషన్ మాస్టర్ ప్రతి ఆదివారం దగ్గర్లోని పెద్ద రైల్వే స్టేషన్ బురద్వాన్ వెళ్లి ఆ వారానికి సరిపడా టిక్కెట్లు ప్రింట్ చేయించుకొస్తుంటారు. మొత్తం మీద ఇంత పెద్ద ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో ఈ ఒక్క స్టేషన్ మాత్రమే “పేరులేని రైల్వే స్టేషన్ “గా ప్రత్యేకంగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ స్టేషన్ బోర్డుపై ఎలాంటి పేరు కనపడదు.
మరిన్ని చూడండి