వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊడిపోతుంది
ఉద్యోగుల పనినాణ్యత, ఉత్పాదకతను పెంపొందించేందుకు కంపెనీలు కొత్త నియమాలను అమలుచేస్తుంటాయి. అయితే చైనా జీజియాంగ్‌లోని ఓ కంపెనీ తమ ఉద్యోగులు ఎవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే వాళ్లను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఉద్యోగులలో నైతికతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. వివాహేతర సంబంధాలతో కాపురాలు సాఫీగా సాగవని, దీంతో వారు పనిపై శ్రద్ధ చూపరని తెలిపింది. సంస్థలో ఉద్యోగులందరూ నాలుగు నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, ఉంపుడుగత్తెలు, వివాహేతర సంబంధాలు ఉండకూడదు, విడాకులు తీసుకోకూడదని నిబంధనలు పెట్టింది. తమ ఉద్యోగులు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. పలువురు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తు్న్నారు.