IND A vs PAK A – Emerging Asia Cup: ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచి అద్భుతంగా ఆడిన భారత్-ఏ జట్టు.. ఫైనల్‍లో మాత్రం తేలిపోయింది. టైటిల్ పోరులో పాకిస్థాన్-ఏ చేతిలో ఇండియా-ఏ ఓటమి పాలైంది. కొలంబో వేదికగా నేడు (జూలై 23) జరిగిన ఫైనల్‍లో భారత్-ఏ 128 పరుగుల తేడాతో పాకిస్థాన్-ఏపై పరాజయం చెందింది. టైటిల్‍ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ బ్యాట్స్‌మన్ తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108 పరుగులు) మెరుపు సెంచరీతో అదరగొట్టగా.. ఓపెనర్లు సయీమ్ అయ్యుబ్ (59), షాబిబ్‍జాదా ఫర్హాన్ (65) అర్ధ శతకాలతో మెరిశారు. భారత బౌలర్లలో రాజ్యవర్ధన్ హంగర్గేకర్ రెండు, రియాన్ పరాగ్ రెండు వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో ఇండియా-ఏ 40 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (51 బంతుల్లో 61 పరుగులు) అర్ధ శతకంతో రాణించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో ఇండియా-ఏకు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియాన్ ముకీమ్‍కు మూడు, మెహ్రన్ ముంతాజ్‍కు, వాసీంకు చెరో రెండు వికెట్లు దక్కాయి.