బన్నీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ.. అవసరమా?

కొన్ని కొన్నిసార్లు ఆవేశం, ఆవేదనలో తీసుకునే నిర్ణయాలు బూమ్ రాంగ్ అవుతుంటాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇలానే చేసి అడ్డంగా బుక్కయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టయ్యి, బెయిల్‌పై బయటికొచ్చిన బన్నీపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మళ్లీ ఎక్కడెక్కడ దొరుకుతాడా? అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం, అసలేం జరిగిందనే విషయాన్ని సభ్య సమాజానికి తెలియాలని, ఇండస్ట్రీకి ఇదొక గట్టి హెచ్చరిక కావాలని సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఆయన మాట్లాడారు అనుకుందాం. ఇందుకు కౌంటర్‌గా శనివారం రోజే మీడియా ముందుకు రావడం ఎందుకు? అసలు తమరికి ఈ సలహా ఇచ్చిన మహానుభావుడికి శతకోటి వందనాలు బాబోయ్ అంటూ బన్నీ వీరాభిమానులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.

వచ్చారు సరే..?

మీడియా ముందుకు వచ్చారు సరే కాంట్రవర్సీకి తావు లేకుండా మాట్లాడి ఉంటే సరిపోయేది కదా..? రేవంత్ మాటలకు కౌంటర్ ఇచ్చినట్లుగా అల్లు అర్జున్ మాట్లాడారనే విషయం ఏ చిన్నపిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతారు. రేవంత్ రెడ్డి అని పేరు ప్రస్తావించనంత మాత్రాన జనాలకు అర్థం కాదు అనుకోవడం అమాయకత్వమే. ఎందుకంటే మాట్లాడే ప్రతిమాట ఎక్కడో, ఎవరికో గట్టిగానే తగులుతున్నట్లుగానే ఉంది కదా? రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, అల్లు అర్జున్ కౌంటర్లు చూస్తే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక్కడే ప్రభుత్వానికి బన్నీ అడ్డంగా దొరికిపోయారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ ఆడియో, వీడియోలను చూపిస్తూ మరి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి.

ఎవరీ ఐడియా ఇచ్చింది?

అల్లు అర్జున్‌కు మీడియా ముందుకు రావాలనే ఆలోచన ఎవరిచ్చారో కానీ అట్టర్ ప్లాప్. వచ్చే ముందు కనీసం ఏం మాట్లాడాలో..? ఎలా మాట్లాడాలో కూడా ఎలాంటి డైరెక్షన్స్ లేకపోవడం గమనార్హం. పేపర్‌లో రాసుకొని వచ్చినా, పక్కనుండి అల్లు అరవింద్ కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఒకింత టెంపర్ కోల్పోయి మాట్లాడారన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ. పోనీ అభిమానులు, సినీ ప్రియులకు, రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు వివరణ ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. ఎవరూ తప్పుబట్టరు కూడా. అయితే, నేను ఎవరిని దూషించదలుచుకోలేదు..? నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి? మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను. నేను పోలీసుల డైరెక్షన్‌లోనే వెళ్లాను. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు. నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు. తర్వాతి రోజు శ్రీతేజ్ చికిత్స పొందే ఆస్పత్రికి వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారని అల్లు అర్జున్  చెప్పారు.

సమాధానం ఏదీ?

పోనీ ఎవర్ని దూషించాలని తమరికి మనసులో ఉంది? రేవంత్ రెడ్డినే కదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. తప్పుడు ఆరోపణలు అన్నప్పుడు దానిపై క్లారిటీగా మాట్లాడటం, దానిపై వివరణ ఇచ్చుకోవడం మీ బాధ్యత కాదా? మరి ఏదీ వివరణ? మూడేళ్ల కష్టాన్ని సినిమా థియేటర్లలో చూద్దామని వెళ్లారు సరే, రద్దీగా ఉండే సంధ్యకే ఎందుకెళ్లారు? ఏఎంబీ లాంటి పెద్ద పెద్ద వాటికి పోయి ఉంటే ఇలాంటి తలనొప్పులు ఉండేవి కదా? ఈ మాత్రం తెలియకపోతే ఎలా? పీఆర్ టీమ్ ఏమైంది.. ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఇక మరుసటిరోజు దాకా తెలియకపోవడం ఏంటి? టీవీలు, సోషల్ మీడియాలో కోడై కూస్తుంటే బన్నీ నోట ఇలాంటి మాటలు రావడం ఎంతవరకు సబబు? ఇక ఆస్పత్రికి వెళ్లొద్దని మీ వాళ్లు చెప్పారా? సరే, అక్కడ పోయింది ప్రాణం, ఇంకొకరు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారనే విషయం చెప్పలేదా? అడగాల్సింది ఎవర్ని మీ వాళ్లనా? లీగల్ టీమ్‌నా? కనీసం నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద లాయర్‌ను ఒక్క మాట అడిగి ఉంటే కోర్టుల నుంచి అనుమతి ఇప్పించేవారన్న విషయం తెలియదా? బెయిల్ ఇప్పించిన మనిషి, అనుమతి ఇప్పించలేరన్న విషయం ఎలా మరిచిపోయారు? అసలు ఈ ఆలోచన తమరికి ఎందుకు రాలేదు? కోట్లు ఖర్చు పెడుతున్న తమరి పీఆర్ టీమ్‌కు ఎందుకు రాలేదు? తమరి ఆస్థాన పెద్దలు, మనుషులకు ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ బన్నీ.

అసలే చిరాకులో ఉంటే..

బన్నీపై కొన్ని మీడియా సంస్థలు, కొందరు మీడియా ప్రతినిధులు గుర్రుగా ఉన్నాయన్న విషయం జగమెరిగిన సత్యమే. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎన్నెన్ని వార్తలు వండి వార్చాయో? బెయిల్ వచ్చిన తర్వాత, మీడియాతో మాట్లాడిన తీరును కొన్ని చానెళ్లు ఎండగట్టడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక శనివారం మీడియా ముందుకు రావడానికి కూడా 7 గంటలకు అని చెప్పి 8 గంటలకు రావడం మీడియా మిత్రులకు చిరాకు పుట్టదా? లైవ్ అంటే తమరిచ్చే అర గంట లేదా గంటపాటు ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్‌ను అన్నీ వాయిదా వేసుకుని మరీ వేచి చూశారు. ఇలా చేయడం పద్ధతేనా? పోనీ తమరు రాసుకొచ్చిన స్లిప్పులు చూసి చదివేసి వెళ్లిపోయారు ఒక్క విలేకరి అడిగిన ప్రశ్నకైనా సమాధానం ఇచ్చారా? నన్ను మాట్లాడనివ్వండి తర్వాత మీరు అడగండి అన్నారు సరే.. అడిగితే ఎందుకు బదులివ్వలేదు. మాట్లాడకుండా ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా అవసరమా? మీడియా సమావేశం మీరు పెట్టారు గనుక మిమ్మల్ని ఏమీ అడగకూడదు..? మీరు చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లడంతో తప్పించుకునే ప్రయత్నమా కాదా?.

వీడియో సరిపోయేదేమో..?

తప్పు లేనప్పుడు సమాధానాలు చెప్పే ఓర్పు, నేర్పు కూడా ఉండాలనే విషయం ఇకనైనా బన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనను కలవడానికి ఇండస్ట్రీ జనాలు వస్తారు.. లైవ్ పెట్టుకోండి అనగానే పెట్టేసుకోవడానికి, మేము చెప్పింది మాత్రమే వినాలి.. టెలికాస్ట్ మాత్రమే చేసుకోండి అనగానే పండగ చేసేసుకునే మీడియాపైన సైతం జనం చిరాకుపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక సభ్య సమాజంలో మరొకటి లేదన్నట్లుగా పోటీ ప్రపంచమైన ఈ మీడియా వ్యవస్థలో ప్రతిదీ సెన్సేషనల్ చేసుకోవడం కూడా ఎంతవరకూ కరెక్టో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు, తమరు అనుకున్నది మాత్రమే చెప్పాలనుకున్నప్పుడు లైవ్ అనేది ఎందుకు? మీడియాను పిలిపించి హడావుడి చేయడం ఎందుకు? సింపుల్‌గా వీడియో రిలీజ్ చేసేస్తే.. ప్రశ్నలు, సమాధానాలు అస్సలు ఉండనే ఉండవు కదా..? మీరొస్తారని, ఏదో చెబుతారని, లోకల్ మొదలుకుని నేషనల్ మీడియా వరకూ అందరూ పనులు మానుకొని, అదే పనిగా మైకులు పట్టుకుని రావాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు కదా. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటే గంటపాటు వెయిటింగ్, బదులివ్వకపోవడం ఇవన్నీ ఎంత చిరాకు అనిపిస్తాయో ఒకసారి ఊహించుకోండి. ఇకనైనా పీఆర్ టీమ్, ఆస్థాన మనుషులు కాస్త జాగ్రత్తగా అన్నీ సెట్ రైట్ చేసుకుని, ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే విషయంలో తగు చర్యలు తీసుకుంటే మంచిది సుమీ..!

Source link