అవును.. టీడీపీ అధిపతి నారా చంద్రబాబును తెలుగు తమ్ముళ్లే అడ్డంగా బుక్ చేసేస్తున్నారు. కూటమి గెలుపుకోసం అన్నీ భుజాన వేసుకుని ఎన్నికల కదనరంగంలోకి దూకిన బాబును అడుగడుగునా సొంత పార్టీయే చేటుగా మారింది. వాస్తవానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు.. ఇప్పుడు పూర్తిగా తన పంథా మార్చేసి అధికార వైసీపీ, వైఎస్ జగన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఇక మంచిగా ఉంటే అస్సలు కుదరుదని.. మాట తీరు, కౌంటర్లిచ్చే విధానం.. ఇలా ఒక్కటా రెండా పూర్తిగా మార్చేశారు. ఇక పెన్షన్ల విషయంలో వైసీపీని అడ్డంగా ఇరికించేసి.. మంచి సింపతీ కొట్టేశారు బాబు. పట్టుమని పది గంటలు కూడా కాకమునుపే గాలి మొత్తం తీసేశారు టీడీపీ నేతలు. వైసీపీని బాబు బుక్ చేస్తే.. బాబును మాత్రం సొంత మనుషులే బుక్ చేశారనే చర్చ పెద్ద ఎత్తునే జరుగుతోంది.
అసలేం జరిగింది..?
వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచడానికి వీల్లేదని.. ఒక్క పెన్షన్ల పంపిణీకే కాదు, ఎన్నికలకు కూడా దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ క్లియర్ కట్‌గా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. ఈసీని సంప్రదించడం, కోర్టు మెట్లెక్కడంతో దీనిపై స్పందిస్తూ వలంటీర్లపై కీలక ప్రకటనే చేసింది. దీన్ని ఏదో ఒక విధంగా టీడీపీ అయితే కవర్ చేసుకుంది.. ఆ తర్వాత అది కాస్త సద్దమణిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, ప్రతిపక్షాల డిమాండ్‌తో పెన్షన్ల పంపిణికీ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా దొరికాయి. ఏప్రిల్-03 నుంచి స్థానికంగా ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. అవును.. పెన్షన్లు వలంటీర్ల చేత పంపిణీ చేయించకుండా చూడాలని చంద్రబాబుకు చెప్పాం.. నారా లోకేష్‌కు కూడా చెప్పాం.. వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మా వల్లే ఈ పెన్షన్లు ఆగాయి అని ఆదిరెడ్డి కుండ బద్ధలు కొట్టినట్లుగా చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లు చంద్రబాబు పడిన కష్టం మొత్తం రివర్స్ అయిపోయింది.
ఎందుకిలా..?
అసలే పెన్షన్ల విషయంలో వైసీపీ వర్సెస్ కూటమిగా పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వైసీపీ మైనస్‌లన్నీ ఏపీ ప్రజలకు చాటిచెబుతూ వెళ్తున్న చంద్రబాబు పెన్షన్ల విషయంలో కీలక స్టెప్ ముందుకేశారని అందరూ అనుకున్నారు కానీ.. ఇలా సొంత పార్టీ వాళ్లే బుక్ చేస్తారని మాత్రం అనుకొని ఉండరేమో. వాస్తవానికి పెన్షన్లు ఇచ్చేటప్పుడు వైసీపీకి ఓటేయాలనే ప్రచారానికి వలంటీర్లు ఒడిగడతారనే ఆపారు సరే.. ఈ విషయం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ.. ఇలా బుమారాంగ్ అయ్యేలా చేజేతులారా చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఏపీలో గల్లీ గల్లీన టీడీపీయే.. ఈ పెన్షన్లు ఆపిందని కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని చెప్పుకుంటున్న పరిస్థితి. దీంతో పెన్షనర్లకు బాబు విలన్ అయ్యారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. మొన్న నాణ్యమైన మందు అని మహిళలకు.. ఆ తర్వాత శింగనమల ఇష్యూ.. ఇప్పుడేమో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ఇష్యూ.. మున్ముందు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఏంటో మరి. అయినా ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆచితూచి మాట్లాడటం.. ముందుకెళ్లడం చేస్తే తప్ప మంచి రోజులు వచ్చేలా లేవని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్న పరిస్థితి.