2017లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేసిన హైకోర్టు… దాని కాలపరిమితి ముగిసిందని తెలిపింది. అయితే ప్రస్తుత ప్రక్రియను దాని ఆధారంగానే కొనసాగించి, దాని ప్రకారమే పరిహారం నిర్ణయిస్తే పిటిషనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని భూసేకరణ నోటిఫికేషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్లు, అధికారులు పరస్పర ప్రయోజనాల నిమిత్తం పరిహారం, ఇతర పునరావాస చర్యలకు సంబంధించి చర్చలతో ఒక పరిష్కారానికి రావాలని సూచించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను మూడు నెలల వ్యవధిలోగా తీసుకోవాలని స్పష్టం చేసింది. మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.