Ambati Rayudu On Pawan : వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. పవన్ కు మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్, వైసీపీ మద్దతుదారు అంబటి రాయుడు… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లడం సహజమేనన్నారు. అలాంటి విమర్శలు పట్టించుకోకుండా నిర్భయంగా ముందుకు వెళ్లాలని అంబటి రాయుడు సూచించారు. వాలంటీర్ల వ్యవస్థ అనేది గొప్ప ఆలోచన అన్న ఆయన.., ప్రతి మనిషికి ఏ సేవలు అవసరమో అవన్నీ వాలంటీర్ల సరైన సమయానికి అందుతున్నాయన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవలు అందించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంబటి రాయుడు అన్నారు.