మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు-tg grama sabalu turns into fight filed question officials eligible candidates angry ,తెలంగాణ న్యూస్

మంత్రులకు తప్పని నిరసన సెగ

ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటనతో నాలుగు గ్రామ సభలో పాల్గొన్నారు. మానకొండూర్ నియోజకవర్గం రేణికుంట, చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్, వేములవాడ నియోజకవర్గం రుద్రంగి, ధర్మపురి నియోజకవర్గం జైన గ్రామసభలో పాల్గొన్న మంత్రులకు నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు నిరసన సెగ తగిలించారు. రిజర్వాయర్ తో తమ కొంపలు ముంచొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రిజర్వాయర్ నుంచి ఇళ్లలోకి నీళ్లు చేరి నిద్రలేని రాత్రి గడపవలసి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా ఆందోళనతో అడ్డుతగిలారు. దీంతో మాజీ సర్పంచ్ నజీర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారిని సముదాయించి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ అని నిరుపేదలందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

Source link