Tadipatri News : అనంతపురం జిల్లా సజ్జలదిన్నెలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి… నిద్రపోతున్న దంపతులపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు బాలికకు మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. ఎల్లనూరు మండలం వేములపల్లెకు చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణి తాడిపత్రి పరిధిలోని సజ్జలదిన్నె వద్ద ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వీరి బంధువు రమేశ్‌రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. రమేశ్ రెడ్డిని మద్యం ఎక్కువగా తాగొద్దని నల్లపురెడ్డి మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న రమేశ్ రెడ్డి…శనివారం అర్ధరాత్రి బయట మంచంపై నిద్రపోతున్న నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. వీరితో పాటు పక్కనే నిద్రిస్తున్న పూజిత అనే బాలికకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు అవ్వగా, బాలిక స్వల్పంగా గాయపడింది. స్థానికులు నల్లపురెడ్డి, కృష్ణవేణిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.