ఎందుకిలా…?
మరికొద్దిరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు… తెలంగాణ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీలో పని చేసిన అనుభవం ఉన్న చాలా మంది ఉన్నారు. ఇక వారే కాకుండా… చాలా నియోజకవర్గాల్లో సెటిలర్లు భారీగా ఉన్నారు. ఇందులో కమ్మ సామాజికవర్గం వారి సంఖ్య ఎక్కువే. ఇక ప్రస్తుత బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నేతలు కూడా తెలుగుదేశం నుంచి వచ్చినవారే. ఈ పరిస్థితుల నేపథ్యంలో… చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా ఉంటుందని… సదరు నేతలు భావించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, పటాన్ చెరుతో పాటు ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఆయా నియోజకవర్గాల్లోలో మెజార్టీ సంఖ్యలో బీఆర్ఎస్ కు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ క్రమంలో… చంద్రబాబు అరెస్టును ఖండించకుండా, హైకమాండ్ వైఖరిని అనుసరిస్తే… నష్టం వాట్లిల్లే అవకాశం ఉంటుందని అంచనా వేయటమే కాకుండా…. అందుకు తగ్గట్టుగానే సదరు నేతలు… బహిరంగంగానే స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం కూడా చంద్రబాబు అరెస్టును బహిరంగంగా ఖండించారు. దీనికి కారణం లేకపోలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ మండలంలో అత్యధికంగా సెటిలర్లు ఉన్నారు. పైగా చంద్రబాబుతో కలిసి పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.