రాజమౌళిని ఫాలో అయితే అంతే – అనురాగ్

బాలీవుడ్ లో గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే లాంటి సంచలన చిత్రాలను అందించిన దర్శకుడు అనురాగ్ కశ్యప్. అప్పట్లో తన డిఫరెంట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఈ మధ్య డైరెక్టర్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ సరైన స్క్రిప్ట్ దొరికితే మళ్లీ తన టాలెంట్ నిరూపించగల పవర్ ఉన్న వ్యక్తి.

కొన్ని నెలల క్రితం అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ హిందీ సినిమా పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దక్షిణ భారత సినిమా అద్భుతమైన స్థాయికి ఎదిగిందని కానీ బాలీవుడ్ రచయితలు మాత్రం ముంబైలోనే మునిగిపోయారని విమర్శించారు. మాస్ ఆడియెన్స్ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోకుండా సినిమాలు రూపొందిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అనురాగ్ కశ్యప్ ఇటీవలే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో మాస్టర్ క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కొత్త దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన శైలి ఉండాలని, ఎవరినీ అనుకరించకుండా ఒరిజినల్‌గా సినిమాలు తీయాలని సూచించారు. ప్రస్తుతం చాలా మంది రాజమౌళిని ఫాలో అవుతూ ఆయన తరహా చిత్రాలను తీయాలని ప్రయత్నిస్తున్నారని కానీ అంతా సక్సెస్ కాకపోవడానికి అదే కారణమని చెప్పారు.

రాజమౌళిని ఇమిటేట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆయన సినిమాలు విస్తృతంగా పరిశీలించండి కానీ అదే ఫార్ములా రిపీట్ చేయకండి. ఒరిజినల్‌గా ఆలోచించండి. కెజిఎఫ్ హిట్ అవ్వడంతో ఆ తరహా సినిమాలు తీస్తే అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటామని అనుకోవడం పొరపాటు అని కశ్యప్ స్పష్టం చేశారు.

ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియా సినిమాలపై చాలా హైప్ క్రియేట్ అవుతోంది. కానీ అనురాగ్ కశ్యప్ మాటల్లో చెప్పాలంటే ఇది కొత్త కాదని.. గతంలోనే చిరంజీవి ప్రతిబంధ్, నాగార్జున శివ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల ట్రెండ్ బంగారు బాతుగా మారిపోయిందని.. కానీ ఒరిజినాలిటీ లేకుండా కేవలం ఫార్ములా ఫాలో అవ్వడం వల్ల ఫలితం రాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అనురాగ్ కశ్యప్ చెప్పిన విషయాలు నిజానికి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. తాజాగా కన్నడలో కబ్జా సినిమాను భారీ బడ్జెట్ తో తీసినా.. ప్రేక్షకులు దాన్ని కెజిఎఫ్ కాపీగా నిందించారు. అలాగే బాహుబలి విజయం చూసి విజయ్ చేసిన పులి కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజమౌళి సినిమాల ప్రభావం అంతగా ఉంది. మనదేశంలోనే కాదు హాలీవుడ్ దర్శకులు కూడా జక్కన్న టెక్నిక్ పై ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఎస్‌ఎస్‌ఎంబి 29 ప్రాజెక్ట్ కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నా.. పెద్దగా ఆశ్చర్యం కలిగించటం లేదు.

Source link