రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు సరికొత్త చరిత్ర, సుదీర్ఘ చర్చ జరిగిన బిల్లుగా రికార్డు

Waqf Amendment Bill | న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభలలో ఇటీవల ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. అయితే ఎగువ సభ రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు రికార్డులు తిరగరాసింది. రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరిగిన బిల్లుగా వక్ఫ్ బిల్లు నిలిచింది.  

రాజ్యసభలో వక్ఫ్ బిల్లు 2025పై అధికార ఎన్డీయే, విపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా.. సంఖ్యా బలం ఉండటంతో పార్లమెంట్ ఉభయ సభలలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ క్రమంలో రాజ్యసభలో సుదీర్ఘంగా 17 గంటలకు పైగా ఈ బిల్లుపై చర్చ జరిగింది. దాంతో 1981లో జరిగిన  సుదీర్ఘ చర్చ రికార్డును వక్ఫ్ సవరణ బిల్లు అధిగమించింది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు రాజ్యసభలో జరిగిన సుదీర్ఘ చర్చకు సంబంధించిన బిల్లుపై ట్వీట్ చేశారు. “పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మురుగన్, కార్యదర్శి, అదనపు కార్యదర్శి JS తో కలిసి పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న వీడియో పోస్ట్ చేశారు. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై 17 గంటలు 2 నిమిషాలు చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ 1981లో ESMA అంశంపై జరిగిన 16 గంటల 55 నిమిషాల రికార్డు సమయాన్ని బద్దలు కొట్టింది” అని కిరణ్ రిజిజు తన పోస్టులో రాసుకొచ్చారు.

బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఏప్రిల్ 3న రాజ్యసభ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన చర్చ జరిగింది. గురువారం ఉదయం 11:00 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4:02 గంటల వరకు వక్ఫ్ సవరణ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ  కొనసాగింది.

పార్లమెంట్ ఉభయ సభలలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర మంత్రి రిజిజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటరీ కార్యకలాపాల్లో ఇది కొత్త రికార్డు అని, ఏ అంతరాయం కలగకుండా జరిగిన చర్చకు ఇది నిదర్శనమని అభివర్ణించారు. మరోవైపు బుధవారం నాడు దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత లోక్‌సభ వక్ఫ్ బిల్లును ఆమోదించింది.

రాజ్యసభ ఛైర్మన్ హర్షం..

రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖ‌డ్ సైతం వక్ఫ్ సవరణ బిల్లు, 2025 ఆమోదం పొందడం చారిత్రాత్మక చట్టం అన్నారు. చర్చల ద్వారా ఏం సాధించవచ్చో అందుకు ఈ బిల్లును జ్ఞాపికగా అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక బిల్లుపై చర్చలో పాల్గొన్న సభ్యులను ధన్‌ఖడ్ అభినందించారు. ఏప్రిల్ 3న ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు చర్చ కొనసాగింది. రాజ్యసభ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన చర్చ అన్నారు. వక్ఫ్ బిల్లుపై 17 గంటల పాటు చర్చకు చొరవ చూపినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశంలో రాజ్యసభలో మొత్తం 159 గంటలు పాటు చర్చలు జరిగాయి.

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link