రీ కౌంటింగ్ ఫలితాల కోసం ఆగొద్దు.. సప్లిమెంటరీకి అప్లై చేయాలని బోర్డు సూచన…-ts bse advise to apply for supplementary exams before re counting results ,తెలంగాణ న్యూస్

 

TS SSC 2024 Supplementary Exams: తెలంగాణ పదో తరగతి 2024 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం సార్వత్రిక ఎన్నికల ముగిసిన వెంటనే పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. విద్యార్ధులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జూన్ 3 నుంచి పరీక్షలు…

పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల్ని జూన్ 3 నుంచి జూన్‌ 13వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షల్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు గడువు తక్కువగా ఉన్నందున 2024 మార్చిలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్ధులు Re Counting రీ కౌంటింగ్, Re Verification రీ వెరిఫికేషన్‌ పలితాలతో సంబంధం లేకుండా జూన్‌లో జరిగే Advanced Supplementary అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ముఖ్యమైన తేదీలు ఇవే…

  • విద్యార్ధులు తాము చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మే 16వ తేదీలోగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
  • ప్రధానోపాధ్యాయులు ట్రెజరీ ఆఫీసుల్లో లేదా ఎస్‌బిఐ బ్యాంక్ ట్రెజరీ బ్రాంచిలలో మే 17కల్లా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
  • ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్లలో ముద్రించిన ఎస్‌ఆర్ జాబితాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో మే20వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు.
  • జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి మే 22లోగా జాబితాలను పంపాలని సూచించారు.

రూ.50రుపాయల పెనాల్టీతో విద్యార్ధులు సంబందిత సబ్జెక్టు పరీక్ష జరిగే రెండు రోజుల ముందు కూడా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. పాఠశాలల నుంచి సమాచారం అందాల్సిన విద్యార్ధుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. వారి ఫలితాలను త్వరలో ప్రకటిస్తారు.

రీ కౌంటింగ్‌కు దరఖాస్తు ఇలా…

తెలంగాణ పదో తరగతి పరీక్షల రీ కౌంటింగ్ కోసం విద్యార్ధులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫలితాలు వెలువడిన 15రోజుల్లోగా మే15వ తేదీలోగా ఎస్‌బిఐ బ్యాంకులో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 0202 ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ అండ్ కల్చర్, 01 జనరల్ ఎడ్యుకేషన్, 102 సెకండరీ ఎడ్యుకేషన్, 06 డైరెక్టర్ ఆఫ్‌ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌, 800 యూజర్‌ ఛార్జెస్‌ హెడ్ అకౌంట్లకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రీ వెరిఫికేషన్‌, జిరాక్స్‌ కాపీల కోసం…

పదో తరగతి పరీక్షల రీ వెరిఫికేషన్‌ కోసం విద్యార్ధులు సంబంధిత పాఠశాలల్లో హాల్ టిక్కెట్స్ జిరాక్స్‌ కాపీతో, కంప్యూటర్లో జారీ చేసిన మార్కుల జాబితాతో హెడ్‌ మాస్టర్ సంతకంతో రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన దరఖాస్తులు, డిఇఓ కార్యాలయంలో సమర్పించాలి. వాటిని మాత్రమే అనుమతిస్తారు. పోస్టు ద్వారా పంపే వాటిని అనుమతించరు. దరఖాస్తు నమూనా ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. https://www.bse.telangana.gov.in/ లో అందుబాటులో ఉంచారు. జిల్లా డిఈఓ కార్యాలయాల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000ఫీజును చలాన ద్వారా చెల్లించాలి. మే 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్‌లను అనుమతించరు. రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటేరీ కౌంటింగ్ అవసరం లేదని వివరించారు.

ర్యాంకులు ప్రకటిస్తే గుర్తింపు రద్దు…

జీవోఎంఎస్‌ 145 ప్రకారం తెలంగాణలో విద్యార్ధులకు ర్యాంకుల్ని ప్రకటించడాన్ని నిషేధించినట్టు ప్రభుత్వ పరీక్షల శాఖ డైరెక్టర్ ప్రకటించారు. ఫలితాల్లో ర్యాంకుల్ని ప్రకటించిన స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

100శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు….

తెలంగాణలో 3927 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. వీటిలో 17ఎయిడెడ్ స్కూళ్లు, 81 ఆశ్రమ పాఠశాలలు, 142 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు, 37 ప్రభుత్వ పాఠశాలలు, 177 కేజీబీవి స్కూళ్లు, 60మోడల్ స్కూళ్లు, 1814 ప్రైవేట్ స్కూళ్లు, 24 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు, 77 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 112 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, 39 ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు, 1347 జడ్పీ స్కూళ్లలో నూరు శాతం ఫలితాలు సాధించారు.

Source link