రేవంత్ రెడ్డికి టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్..!?

ఒకటి కాదు రెండు కాదు సుమారు నూట పదేళ్ల చరిత్ర ఉన్న తెలుగు సినిమా మన దేశంలోనే అన్ని ఇతర భాషల సినిమా ఇండస్ట్రీ కన్నా పెద్దది. గత పదేళ్లలో జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతున్న అనేక సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండే వస్తున్నాయి. సినిమాలో నటించే నటులు, ఎక్స్‌ట్రా ఆర్టిస్టుల నుంచి మొదలుకొని, ఇతర టెక్నికల్ విభాగాలు, డిస్ట్రిబ్యూషన్, సినిమా థియేటర్ల మీద, ఓటీటీ, టీవీ, యూట్యూబ్ చానెళ్లు ఇవన్నిటి మీదా ఆధారపడి జీవించే వారి సంఖ్య సుమారు పది లక్షల మంది. ఇన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ మీద, ఇందులో ప్రముఖ కుటుంబాల మీద సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షతో చేస్తున్న వరుస దాడులు అత్యంత దురదృష్టకరమని సినీ పెద్దలు ఆగ్రహంతో ఊగిపోతున్నారట.

ఇంకెన్నాళ్ళు ఇలా!

ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యిందని వార్తలు గుప్పుమంటున్నాయి. వ్యక్తిగత దాడులు చేస్తుండటంతో సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు అని తెలిసింది. ఒకటా రెండా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకటా రెండా లెక్కలేనన్ని దారుణాలు చోటు చేసుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయన్నది టాలీవుడ్ పెద్దల భావనట. రేవంత్ ఏలుబడిలో సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎక్కడి నుంచి ఎక్కడికో!

ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై వ్యక్తిగతంగా దాడి చేయడం, వాళ్ల పరువును నడి రోడ్డున పడేయడంతో ఇదొక పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఇప్పటికీ మంత్రి కొండా సురేఖ వర్సెస్ నాగార్జునగా వ్యవహారం నడుస్తూనే ఉన్నది. తొలుత హైడ్రాను రంగంలోకి దింపి, నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేయడం మరింత వివాదానికి దారితీసింది. ఒక్క ఫ్యామిలీపైనే చైతూ-సమంత విడాకుల అంశంపై జుగుప్సాకర వ్యాఖ్యలు, ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత జరపడంతో టాలీవుడ్ టార్గెట్‌గా రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యింది.

నషాళానికెక్కిన కోపం!

ఇక సంధ్య థియేటర్ సంఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ కోపం ఒక్కసారిగా నషాళానికెక్కింది. అంతేకాదు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తోందని, ఎందుకీ తెలివి తక్కువ పనులు? అంటూ అభిమానులు, సినీ ప్రియులు తిట్టి పోస్తున్నారు. దీంతో అభిమానులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. బన్నీ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమంది అభిమానులపై కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకూ నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది. నిందితులపై ఐటీ యాక్టుతో పాటు బీఎన్ఎస్ 352,353(1)(బీ) సెక్షన్ల కింద కేస్ నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఏం తక్కువ చేశాం!

వేల కోట్ల పన్నులు కడుతున్నా తమ పరిశ్రమ పట్ల ఈ వేధింపులు ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు. ఈ పరిస్థితిలో మార్పు లేకపోతే తాము పరిశ్రమ కార్యకలాపాలను, తమ నివాసాలను వేరే రాష్ట్రాలకు తరలించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పది లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఏ సాయమూ చేయకపోగా రివర్స్‌లో ఇట్లా వేధింపులకు దిగడంపై వారు సీరియస్‌గా స్పందించాలని డిసైడ్ అయ్యారు అని సినిమా పరిశ్రమ వర్గాల సమాచారం.

టాలీవుడ్ అంతా ఒక్కటై..!

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని తెలిసింది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్ర నేతలకు ఫిర్యాదు చేయడానికి కూడా పెద్దలు భావిస్తున్నారని సమాచారం. అప్పటికీ ప్రభుత్వంలో టాలీవుడ్ పట్ల మార్పు రాకపోతే వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాలని ఒకరిద్దరు తమ అభిప్రాయాలను చెప్పగా.. ఏపీకి వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అయినట్ల సమాచారం. నాటి కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు ఇండస్ట్రీ పట్ల చాలా మంచిగా ఉండేవారని, కనీసం అందులో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క శాతం కూడా ప్రవర్తించడం లేదన్నది టాలీవుడ్ భావనలో ఉందట. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు మరి.

Source link