ఆర్థిక కారణాలతో ఆలస్యం
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం జాప్యం జరిగిందన్నారు. రైతులకు అందిచాల్సిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని కేసీఆర్ తెలిపారు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు, ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు రైతులను ఆర్థికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.