తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా అమలుపై కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మారీచుల మాటల నమ్మొద్దన్నారు. సోనియా గాంధీ గ్యారంటీగా తాను చెబుతున్నానని రైతులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.7 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్పగించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆస్తులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము ప్రతినెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు.