Cabinet Decisions : తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు. వరద బాధితులకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో మెట్రో రైలును భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. రాయదుర్గం-ఎయిర్ పోర్టు మధ్య మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు.. డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు, మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు మెట్రో విస్తరణ పనులు చేపట్టున్నట్లు తెలిపారు. ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు, భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరణ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణ, పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తిచేస్తామన్నారు. విమానాశ్రయం నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ నిర్ణయించిందన్నారు.