విడాకులు తీసుకున్న చాహల్ ధనశ్రీ

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది. వీరి విడాకులను ఖరారు చేసినట్లు సమాచారం. గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో తుది విచారణ జరిగింది. అవసరమైన లాంఛనాలు కోర్టులో పూర్తయ్యాయి. చాహల్ ధనశ్రీ ఇద్దరూ ఉదయం 11 గంటలకు కోర్టుకు హాజరయ్యారు.

కోర్టు విచారణ సమయంలో న్యాయమూర్తి ఈ జంటను కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరయ్యేలా ఆదేశించారు. సుమారు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ కొనసాగింది. చివరగా న్యాయమూర్తి ఇద్దరూ విడిపోవడానికి పూర్తిగా అంగీకరించారా అని ప్రశ్నించగా పరస్పర సమ్మతితో విడిపోవాలని నిర్ణయించుకున్నామని చాహల్, ధనశ్రీ తెలియజేశారని సమాచారం. 

తుది తీర్పు వెలువడే ముందు గత 18 నెలలుగా వారు విడివిడిగా నివసిస్తున్నామని కోర్టుకు వెల్లడించారు. తమ సంబంధంలో ఎలాంటి సానుకూలత లేదని భవిష్యత్తులో కూడా కలిసి జీవించే పరిస్థితి లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. కోర్టు విచారణ అనంతరం అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. సాయంత్రం 4:30 గంటలకు బాంద్రా ఫ్యామిలీ కోర్టు తుది తీర్పును వెలువరించినట్లు సమాచారం.

విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలో, చాహల్ ధనశ్రీ ఇద్దరూ తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా రకరకాల సందేహాలు రేకెత్తించారు. వీరిద్దరూ విడిపోతున్నారా ? లేదా ? అన్నది కొంతకాలంగా స్పష్టత లేకుండా పోయింది. అయితే తాజాగా జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ జంట విడిపోయిందని తేల్చిచెప్పింది.

ఇప్పటివరకు చాహల్ ధనశ్రీ తమ విడాకుల గురించి ఓపెన్‌గా మాట్లాడలేదు. అయితే భవిష్యత్తులో వీరు దీనిపై స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Source link