Revanth Reddy : ధరణి పోర్టల్ అక్రమాలపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోందని, కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుందని ఆరోపించారు. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్ ను ఆధారాలతో సహా సీరియల్ గా బయటపెడతామన్నారు. ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి రూపంలో ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ లో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ధరణి మొత్తం కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉందన్నారు. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ ధరణిలో జరుగుతోందన్నారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయన్నారు. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.