Hyderabad Rains: హైదరాబాద్‍లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహానగరం తడిసి ముద్దవుతోంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వర్షం వల్ల హైదరాబాద్‍లో ట్రాఫిక్‍కు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా చోట్ల రహదారులపైనే నీరు నిలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజులు (జూలై 21, జూలై 22) సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆదేశించారు. అయితే, వైద్యం, పాల సరఫరా లాంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం వెల్లడించారు. ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.