విపక్షంలో ఉన్నప్పుడు పనికొస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు కూలుస్తాయి- అసలేంటి స్ట్రాటజీ సంస్థల అసలు కథ

Andhra Pradesh Latest News: పొలిటికల్ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకోవడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న టైంలో పొలిటికల్ పార్టీలతో ఈ స్ట్రాటజీ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గెలుపు దిశగా పార్టీలను నడిపించే బాధ్యత తీసుకుంటాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సంస్థల సేవలను వినియోగించుకుంటున్నాయి. కానీ విపక్షంలో ఉన్నప్పుడు ఎఫెక్టివ్‌గా పని చేసిన సదరు సంస్థలు అధికార పార్టీలను మాత్రం ముంచేస్తున్నాయి.  

2019లో గ్రూప్ M తో దెబ్బ తిన్న చంద్రబాబు సర్కార్ 
 2014లో సరికొత్త ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పరిపాలనలో సహకారిగా గ్రూప్ M అనే సంస్థను నియమించుకున్నారు. ప్రధానంగా వాళ్ళ పని గ్రౌండ్ లెవెల్‌లో ప్రభుత్వ పనితీరుపై ఫీడ్ బ్యాక్ సేకరించి సీఎంవోకు అందించడం. సీఎంఓకు అనుసంధానంగా పని చేసే గ్రూప్ Mను దాటి డైరెక్ట్‌గా సీఎంకి ఇన్ఫర్మేషన్ అందించే అవకాశం ఇతరులకు ఉండేది కాదని అప్పటి టిడిపి నాయకులే వాపోయేవారు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని సీఎంకు చేరవేయడంలో ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి అనేది 2019 ఎన్నికల తర్వాత జరిగిన అంతర్మథనంలో పార్టీ పెద్దలకు తెలిసింది.

Also Read: దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌- ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన

2024లో జగన్‌ను ఘోరంగా దెబ్బతీసిన ఐ ప్యాక్ 
ఒక్క ఛాన్స్ నినాదంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తెచ్చింది ఐ ప్యాక్. జగన్ పాదయాత్ర డిజైనింగ్ కూడా వాళ్లదే అని ఆ సంస్థ చెప్పుకుంది. 2019 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆ సంస్థ నుంచి తప్పుకున్నా ఆ సంస్థ మాత్రం జగన్ ప్రభుత్వంతో కొనసాగింది. జగన్ ప్రభుత్వంలో కార్యకర్తలు నాయకులు మంత్రుల కంటే ఐ ప్యాక్ చేసే సర్వేలపైనే పూర్తిగా ఆధారపడ్డారనేది ఆ పార్టీ నాయకుల మాట. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే కేవలం ఆ సంస్థ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి సీట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ పరిస్థితి అస్సలు బాలేదని వైసిపి నాయకులు వాపోతున్నా జగన్ మాత్రం వారిని దగ్గరకు రానివ్వనే లేదు. ఎన్నికల సమయంలో ఏకంగా వై నాట్ 175 నినాదంతో బరిలో దిగి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయిన దుష్ఫలితాన్ని అందుకుంది జగన్ పార్టీ.

ప్రస్తుతం ఇదే పంథాలో కూటమి ప్రభుత్వం 
టిడిపి విపక్షంలో ఉన్నప్పుడు పని చేసిన రాబిన్ టీం అధికారులకు వచ్చిన తర్వాత కూడా వారితో కొనసాగుతోంది. కానీ విచిత్రంగా అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోపే సొంత కార్యకర్తల్లోనే టిడిపి వ్యవహార శైలిపై అసంతృప్తి చెలరేగుతోంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జీవీ రెడ్డి రాజీనామా తర్వాత తనకు మద్దతుగా టిడిపి కార్యకర్తలు నుంచి వెలువడుతున్న సోషల్ మీడియా పోస్టులే. అంటే కార్యకర్తల మనసుల్లో ఉన్న అభిప్రాయాన్ని వాళ్లలో జరుగుతున్న చర్చను సదరు స్ట్రాటజీ సంస్థ పసిగట్టలేకపోయిందా దాన్ని పార్టీ హైకమాండ్ వరకు చేరవేలేకపోయిందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!

ఢిల్లీలో కేజ్రీవాల్‌కు దెబ్బేసిన ఐప్యాక్ 
ఢిల్లీలో అధికార పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీకి కూడా ఐప్యాక్ దెబ్బ తగిలింది. ఒక డైనమిక్ లీడర్‌గా ఉన్న కేజ్రీవాల్‌ని తన సలహాలతో సింపతీ కోరే నాయకుడిగా ఈ సంస్థ మార్చేసింది అన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లోకి వెళ్ళింది. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ తన సహజ సిద్ధమైన ప్రచార సరళిని పక్కన పెట్టేసి దెబ్బ తిన్నారు అనేది ఒక విశ్లేషణ. దానికి కారణం స్ట్రాటజీ సంస్థలు ఇచ్చిన రాంగ్ వ్యూహాలు అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో తిరుగుతున్న మాట. ఓవరాల్‌గా విపక్షంలో ఉన్నప్పుడు పార్టీల విజయానికి సహకరించే ఈ స్ట్రాటజీ సంస్థలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంత ఎఫెక్ట్‌గా పని చేయలేకపోతున్నాయి అనేది వాస్తవంగా కనబడుతోంది.

క్షేత్రస్థాయిని అర్థం చేసుకోక పోవడమే అసలైన ఫెయిల్యూర్ 
ఏదైనా పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వారిని అధికారంలోకి తెచ్చేలాగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ నడపడంలో విజయవంతమవుతున్నాయి. ఓటర్లలో డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో విభజన తేవడం లాంటి ఎమోషన్ ఆధారిత ప్రచారాన్ని నడుపుతాయి స్ట్రాటజీ సంస్థలు. ఇది అప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ అదే పార్టీ అధికారంలోకి వచ్చాక అందర్నీ కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇదిగో అదే ఈ స్ట్రాటజీ సంస్థలకు చేత కావడం లేదు. పరిపాలనపై ఫీడ్ బ్యాక్ ఎమోషన్ ఆధారంగా కాదు దీర్ఘకాలిక అనుభవాల దృష్ట్యా ప్రజల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మెంటాలిటీ ప్రకారంగా ఓటర్లు వేరు ప్రజలు వేరు అన్న ప్రాథమిక సూత్రాన్ని ఈ స్ట్రాటజీ సంస్థలు పట్టించుకోవు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇలాంటి సంస్థలతో అంటకాగుతున్న కీలక నేతలు సైతం ఎదురు దెబ్బలు తింటున్న పరిస్థితి దేశ రాజకీయాల్లో కనపడుతోంది.

మరిన్ని చూడండి

Source link